శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 30 మే 2019 (20:34 IST)

వైఎస్ఆర్ వారసత్వాన్ని జగన్ కొనసాగించాలి : స్టాలిన్ ఆకాంక్ష

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి డీఎంకే పార్టీ అధినేత ఎమ్‌కే స్టాలిన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ఆతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మొదట తెలుగులో ‘అందరికీ నమస్కారం’ అంటూ ప్రజలను పలకరించిన ఆయన అనంతరం తమిళం, ఇంగ్లీషులో సైతం పలకరించారు. 
 
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మంచి జరగాలని కోరుకున్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. మరోవైపు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి అభినందనలు తెలుపుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తన తరఫున, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు అంటూ ప్రసంగాన్ని కేసీఆర్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. 
 
జగన్‌ వయసు చిన్నది, బాధ్యత పెద్దదని వ్యాఖ్యానిస్తూ, ఈ బాధ్యతను అద్భుతంగా నిర్వహించగల శక్తి, సామర్థ్యం జగన్‌లో ఉన్నాయని అన్నారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి పేరు నిలబెట్టాలని వైఎస్‌ జగన్‌కు సూచించారు. చరిత్రలో నిలిచిపోయేవిధంగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మూడు, నాలుగు టర్మ్‌ల వరకు వైఎస్‌ జగన్‌ పాలన కొనసాగాలని కేసీఆర్‌ కోరుకున్నారు.