బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2017 (17:54 IST)

ట్రంప్ నిజమైన స్నేహితుడు.. ఛాయ్‌వాలా ప్రధానిగా ఎదగడం భేష్: ఇవాంకా

హైదరాబాదులో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్-2017 (జీఈఎస్-2017) హెచ్ఐసీసీలో ప్రారంభమైంది. పురాతన కాలంలోనే అంతరిక్ష రహస్యాలను ఛేదించిన భారత్‌కు సంబంధించిన వీడియోతో పాటు నృత్యరూపకానికి టెక్నాలజీని

హైదరాబాదులో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్-2017 (జీఈఎస్-2017) హెచ్ఐసీసీలో ప్రారంభమైంది. పురాతన కాలంలోనే అంతరిక్ష రహస్యాలను ఛేదించిన భారత్‌కు సంబంధించిన వీడియోతో పాటు నృత్యరూపకానికి టెక్నాలజీని జతచేసి నిర్వాహకులు ఈ సదస్సులో ప్రదర్శించారు. ఇది ఆహూతులను ఆకట్టుకుంది. 
 
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ ప్రసంగం అదుర్స్ అనిపించింది. అందమైన భారత దేశానికి వచ్చేందుకు తమకు ఆహ్వానం అందింది. ప్రపంచ ప్రఖ్యాత బిర్యానికీ హైదరాబాద్‌ పుట్టినిల్లు. ముత్యాల నగరంలో యువతే గొప్ప సంపద అంటూ ఇవాంకా పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టి-హబ్‌ తయారైందని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా ఇవాంకా భారత్‌పై ప్రశంసలు కురిపించారు. చాయ్‌వాలా స్థాయి నుంచి దేశాన్ని పాలించే స్థాయికి ఎదగడం అద్భుతమని ఇవాంకా ట్రంప్ కొనియాడారు. శ్వేతసౌధంలోని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు నిజమైన మిత్రుడని ఇవాంకా పేర్కొన్నారు. 70వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారంటూ ఇవాంకా మెచ్చుకున్నారు. పేదరిక నిర్మూలన చర్యలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, భారత ప్రజల చొరవ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. 
 
దేశంలో కొత్త యూనివర్సిటీలు వచ్చాయని, స్టార్టప్ రంగంలో భారత్ ఆసియాలోనే నెంబర్ వన్ అవుతుందని ఇవాంకా వెల్లడించారు. టెక్నాలజీని అందిపుచ్చుకున్న హైదరాబాద్‌కు రావడం సంతోషంగా వుందన్నారు. ఇక్కడి పెట్టుబడిదారులు భవిష్యత్‌కు పూలబాట వేస్తున్నారని, ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమార్పులు తెస్తున్నారన్నారు. తద్వారా సామాజికాభివృద్ధికి కృషి చేస్తున్నారని ఇవాంకా తెలిపారు. 
 
అయితే ఇప్పటికీ మహిళలు వ్యాపారానికి ప్రారంభించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జీఈ సదస్సులో 52శాతం మహిళలు పాల్గొనడం తనకు గర్వంగా వుంది. పురుషాధిక్య సమాజంలో రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలని తెలుసుకున్నాను. అయినా మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య పెరిగిందని చెప్పారు. 
 
150 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఇవాంకా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటని కితాబిచ్చారు. కొత్త ఆవిష్కరణలకు ముందుకొస్తున్న యువతకు స్వాగతం. ఇన్నోవేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌ ఎదుగుతోంది. భారత అంతరిక్ష విజ్ఞానం చంద్రుడిని దాటి మార్స్‌ దాకా వెళ్లింది. కొత్త ఆవిష్కరణలతో వస్తున్న ఔత్సాహికులు విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారని వ్యాఖ్యానించారు.