ఆ ఏటీఎంలో బంపర్ డ్రా... రూ.5 వేలు కావాలంటే రూ.50 వేలు వస్తోంది!
బ్యాంకు ఏటీఎం సెంటరులో కార్డు పెట్టి, మనకు ఎంత డబ్బు కావాలో అవసరమో ఆ వివరాలు నమోదు చేస్తే అంతే మొత్తంలో డబ్బులు రావడం మనకు తెలిసిన విషయమే. అయితే దీనికి వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని టాటా ఇండిక్యాష్ ఏటీఎంలో మాత్రం రూ.5 వేలు కావాలని నమోదు చేస్తే రూ.50 వేలు, రూ.4 వేలు బదులు రూ.20 వేలు, రూ.వెయ్యి డ్రా చేసిన వారికి రూ.5 వేలు వచ్చాయి.
దీంతో అక్కడివారికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రూ.వెయ్యి పైన డ్రా చేసిన వారికే ఇలా అధిక మొత్తంలో నగదు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటపడటంతో ఏటీఎం వద్ద అంతా క్యూ కట్టారు. ఇలా ఐదారు మందికి పైగా నగదు డ్రా చేసిన తర్వాత ఏటీఎంలో డబ్బు అయిపోవడంతో పలువురు నిరాశగా వెనక్కి మళ్లారు. మొత్తానికి శుక్రవారం ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా చేసిన వారికి బంపర్ డ్రా వచ్చినట్టే.