సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్
Mahesh Bhatt, Ahan Pandey, Aneet Padda
మహేష్ భట్ తాజాగా సయారాపై స్పందించారు. మహేష్ భట్ తీసిన ఆషికి చిత్రంతో రాహుల్ రాయ్, అను అగర్వాల్‌లు ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారన్న సంగతి తెలిసిందే. ఆషికి ఇప్పటికీ, ఎప్పటికీ ఇండియన్ స్క్రీన్స్‌పై ఓ ఎవర్ గ్రీన్ క్లాసికల్ లవ్ స్టోరీగా నిలిచిపోతుంది. ఆషికి చిత్రానికి సంబంధించిన సంగీతం కూడా బ్లాక్ బస్టర్‌గా ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉంటుంది. అదేవిధంగా YRF తదుపరి హీరో, హీరోయిన్‌లుగా అహాన్ పాండే, అనీత్ పద్దాలను సయారాతో పరిచయం చేయబోతోన్నారు.
మహేష్ భట్ మాట్లాడుతూ* .. ప్రతి తరానికి ఒక ప్రేమకథ ఉంటుంది. ఆ తరానికి ప్రతిబింబంలా ఆ ప్రేమ కథ నిలుస్తుంది. నా దృష్టిలో సయారా ఈ తరానికి చెందిన ప్రేమ కథగా, ప్రేమకు నిర్వచనంగా మారుతుంది. నేను ఆషికి సినిమాను ఎంతో నిజాయితీతో, స్వచ్ఛమైన ప్రేమతో చేశాను. అందుకే ప్రేక్షకులు ఆ చిత్రానికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ఆ తరువాత అందులో నటించిన వారు రాత్రికి రాత్రే స్టార్లుగా మారారు. సయారాతో మోహిత్ సూరి కూడా అదే చేస్తారని నేను ఆశిస్తున్నాను.
సయారా సినిమా చూసినప్పుడు జనాలకు ఆషికి లాంటి నోస్టాల్జియా ఫీలింగ్ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ నేటి కాలంలో, నేటి తరానికి రొమాంటిక్ సినిమా ఎలా ఉండాలో చెప్పే నియమాల్ని సయారా తిరిగి రాస్తుందని నమ్మకంగా చెప్పగలను. ప్రతి కొత్త తరం మునుపటి తరాన్ని ప్రతిదానిలోనూ అధిగమించాలి. సయారా కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను. మోహిత్ ఓ అద్భుతం. అతను నన్ను అన్ని విధాలుగా అధిగమిస్తే నేను చాలా సంతోషిస్తాను.
సయారాను తెరకెక్కించిన తీరు చూసి మోహిత్ పట్ల గర్వపడుతున్నాను. ఇంత వరకు మోహిత్ తీసిన చిత్రాల్లో ఇది చాలా భిన్నంగా అనిపిస్తోంది. ఈ చిత్రంలో మోహిత్ తనలోని ప్రేమ, లోతుని చూపించినట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి ఓ గొప్ప ప్రేమ కథను ప్రపంచానికి అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సయారాను ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారా? అని నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను
తెరపై ఇద్దరు ప్రతిభావంతులైన నటులతో సయారాను మోహిత్ తెరకెక్కించారు. ఇంత గొప్ప సినిమాను తీసేందుకు ముందుకు వచ్చిన YRF వంటి స్టూడియోని చూస్తే నాకు గర్వంగా, సంతోషంగా ఉంది. సయారా చాలా కొత్తగా కనిపిస్తోంది. కొత్తవారితో మాత్రమే జరిగే ఓ మ్యాజిక్‌లా ఉంది. సయారా చిత్రంపై నా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. జూలై 18న ఈ మూవీని చూడాలని వెయిట్ చేస్తున్నాను అని అన్నారు.
YRF CEO అక్షయ్ విధాని నిర్మించిన సయారా జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఫహీమ్-అర్స్లాన్ పాడిన సయారా టైటిల్ ట్రాక్, జుబిన్ నౌటియాల్ బర్బాద్ పాట, విశాల్ మిశ్రా తుమ్ హో తో, సాచెట్-పరంపర ఆలపించిన హమ్‌సఫర్, అరిజిత్ సింగ్, మిథూన్ కలిసి పాడిన ధున్ పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయన్న సంగతి తెలిసిందే.