ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (14:29 IST)

అమరావతిలో ఘరానా మోసం.. సెంటి భూమి ఇవ్వకుండానే ఫ్లాట్లు

అమరావతిలో తెలుగు తమ్ముళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించినట్టు వార్తలు వస్తున్నాయి. సెంటు భూమి ఇవ్వకుండానే ఫ్లాట్లు కేటాయించుకోవడమేకాదు... వాటిని ఏకంగా అమ్ముకున్నట్టు సమాచారం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ

అమరావతిలో తెలుగు తమ్ముళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించినట్టు వార్తలు వస్తున్నాయి. సెంటు భూమి ఇవ్వకుండానే ఫ్లాట్లు కేటాయించుకోవడమేకాదు... వాటిని ఏకంగా అమ్ముకున్నట్టు సమాచారం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ నయా కుంభకోణం వివరాలను పరిశీలిస్తే, 
 
అమరావతి తుళ్లూరుకు సమీపంలో గౌస్ ఖాన్ (టీడీపీ నేతగా చెపుతున్నారు) అనే వ్యక్తి సీఆర్డియే అధికారులు కుమ్మక్కై రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ కోసం సెంటు భూమి కూడా ఇవ్వలేదు. కానీ, ఈయన భూమి ఇచ్చినట్టు తప్పుడు రికార్డులను సృష్టించారు. అతనికి దాదాపు రూ.3.50 కోట్ల మేరకు లబ్ది కలిగేలా రికార్డులను మార్చారు. అధికారుల మాయాజాలంతో రాజధానికి భూమి ఇవ్వకుండానే గౌస్ ఖాన్ ఎన్నో ప్రయోజనాలను పొందినట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. 
 
భూ సమీకరణలో భాగంగా ఆయన భూమి ఇచ్చినట్టు రికార్డులు మార్చిన ఘటన వెలుగులోకి రావడంతో, సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టపై మచ్చ తెచ్చే ఇటువంటి ఘటనలపై తాను కఠినంగా ఉంటానని హెచ్చరించారు. ఈ విషయమై తనకు నివేదిక సమర్పించాలని సీఆర్డీయే కమిషనర్‌ను ఆదేశించారు. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన సీఆర్డీయే కమిషనర్... లోతుగా విచారణ జరిపి అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. దీనిపై ఆయన మంగళవారం స్పందిస్తూ, రాజధాని ప్రాంతంలో భూకుంభకోణం వ్యవహారాన్ని 4 రోజుల క్రితం గుర్తించామని తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై విచారణ అధికారిని నియమించామని, రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయించామని తెలిపారు. ఈ వ్యవహారం ఉద్దేశపూర్వకంగా జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించబోమని తెలిపారు. అలాగే, 59 వేల ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకలు జరిగేందుకు ఆస్కారం లేదని అన్నారు.