నేటి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తేదీ అయిన శుక్రవారం నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పంపిణీ చేస్తుంది. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 61 లక్షల మంది లబ్దిదారులకు ఈ పెన్షన్ కానుకను అందజేస్తున్నారు.
ఏప్రిల్ 1వ తేదీన నేరుగా లబ్దిదారుల ఇంటి వద్ద, వారి చేతికి పెన్షన్ అందించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ పంపిణీ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు.
అయితే, ఏప్రిల్ 1న తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు. పెన్షన్ కోసం ప్రభుత్వం రూ.1551.16 కోట్లను కేటాయించిన విషయం తెల్సిందే. మొత్తం ఐదు రోజుల్లో 100 శాతం పెన్షన్ పంపిణీ పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.