ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా కళింగరత్న పురస్కారం అందుకున్న రాష్ట్ర గవర్నర్
చిన్నారుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేకమైన చొరవతీసుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. పుస్తక పఠనం విద్యార్థుల మేధోవికాసానికి బాటలు వేస్తుందన్నారు. ఒడిశాలోని కటక్‌లో శుక్రవారం జరిగిన ఆదికవి శ్రీ సరళాదాస్ 600వ జయంత్యుత్సవాల్లో ఉపరాష్ట్రపతి, ఆంధ్రప్రధేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎపి గవర్నర్ హరిచందన్‌ను ఉపరాష్ట్రపతి కళింగరత్న పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయిడు మాట్లాడుతూ శ్రీ సరళాదాస్ ఒడియాలో విరచించిన మహాభారతానికి ఇన్ని శతాబ్దాలయినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదరణ అమూల్యమన్నారు. స్థానిక భాషలో, సరళమైన పదజాలంతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో జరిగే రచనలకు ఇదొక చక్కటి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
కళింగరత్న అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఉపరాష్ట్రపతి అభినందించారు. పురస్కారం అందుకున్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ మాట్లాడుతూ, చిన్నారుల ఆసక్తులకు అనుగుణంగా పున్తక రచన సాగాలన్నారు. మాతృభాషలో నేర్చుకున్నదేదీ మరవలేమని, చిరు ప్రాయంలో జరిగే అమ్మభాష బోధన వారి మనో వికాసానికి మార్గం చూపుతుందని వివరించారు.
శ్రీ సరళాదాస్ ఆదికవిగా సాహిత్యాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలో అందించేందుకు కృషి చేసిన మహనీయుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రదాన్, ఆచార్య గణేశ్ లాల్, సరళసాహిత్య సంసద్ అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర్ స్వాయి సహా పలువురు ఒడియా కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.