శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (22:45 IST)

సవాళ్లను అధిగమిస్తాం.. కరోనాను అదుపు చేస్తాం.. కమలా హారిస్

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అమెరికా ముందున్న సవాళ్లను అధిగమించే దిశగా ఆమె ముందుగానే కార్యాచరణ రూపొందించారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన జో బైడెన్‌ తన ముందున్న సవాళ్ళను అధిగమించడం అంత సులువేమీ కాదని కమలా హారిస్‌ వ్యాఖ్యానించారు. 
 
కరోనా విజృంభణతో అతలాకుతలమై పోతున్న దేశంలో ముందుగా మహమ్మారిని అదుపులోకి తీసుకురావాల్సి వుందని కమలా హారిస్ పేర్కొన్నారు. ఆ తర్వాత కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక దుస్థితిని పరిష్కరించాల్సి వుందని తెలిపారు. బుధవారం నుండి పనిచేయడానికి మేం సన్నద్ధులమవుతున్నామని ఆమె ప్రకటించారు. 
 
చేయాల్సిన పనులు తమ ముందు చాలా వున్నాయని, వాటిని పరిష్కరించడం అంత సులభం కాదని అన్నారు. జనవరిలో మూడో సోమవారాన్ని జాతీయ సేవా దినోత్సవంగా పాటిస్తారు. ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. ''మన ముందు బృహత్తర లక్ష్యాలున్నాయి. కఠోర శ్రమతో, అందరి సహకారంతో వాటిని సాధించగలమని విశ్వసిద్దాం'' అని హారిస్‌ పేర్కొన్నారు.