గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 19 డిశెంబరు 2018 (12:21 IST)

గవర్నర్ నరసింహన్ ఎందుకలా చేశారు..!

అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన. భక్తులు కష్టాలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలే తప్ప ఆయనే భక్తులకు ఒక సమస్యలా మారిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆధ్మాత్మిక క్షేత్రాల సందర్సన పేరుతో శ్రీవారి భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్నారు.  
 
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ కారణంగా సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెలా రెండు నుంచి మూడుసార్లు గవర్నర్ తిరుపతిలో పర్యటిస్తుండటంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. తిరుచానూరు, తిరుమల ఆలయాలకు గవర్నర్ వెళ్ళిన సమయంలో గంటల తరబడి భక్తులు కంపార్టుమెంట్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అది కూడా రద్దీ సమయాల్లోనే గవర్నర్ పర్యటనను కేటాయించుకున్నారు. ఈ నెలలో తిరుచానూరు బ్రహ్మోత్సవాల సమయంలో ఒకసారి, తిరుమల వైకుంఠ ఏకాదశి రోజున మరోసారి గవర్నర్ తిరుపతి, తిరుమలలో పర్యటించడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. 
 
సాధారణంగా గవర్నర్ దర్శనానికి వెళ్ళే సమయంలో తిరుమలలో అరగంట ముందే దర్శనాన్ని నిలిపేస్తారు. మరో 15 నిమిషాల పాటు శ్రీవారిని దర్సించుకుంటారు గవర్నర్. ఆలయంలోకి భక్తులను పంపడానికి మరో 15 నిమిషాల సమయం పడుతుంది. ఇలా గవర్నర్ వచ్చినప్పుడల్లా టిటిడి తిరుమలలో గంట సమయాన్ని కేటాయిస్తోంది. 
 
సాధారణ రోజుల్లో అయితే రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే రద్దీ సమయాల్లోనే గవర్నర్ వస్తుండటంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. గవర్నర్ దర్శనం చేసుకునే గంట సమయంలో కనీసం 5వేల మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. 
 
గతంలో రాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాల్ శర్మ కూడా ఇదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయానికి పదేపదే వచ్చి సామాన్య భక్తులకు ఇబ్బందులకు గురిచేసేవారు. భక్తుల నుంచి విమర్శలు రావడంతో అప్పట్లో ఆయన వెనక్కి తగ్గారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్ కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తుండడంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తోందని అంటున్నారు.