ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా
ఊహించినట్టే జరిగింది. భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆర్బీఐ గవర్నరుగా ఉర్జిత్ పటేల్ 2016 సెప్టెంబరు 4వ తేదీన నియమితులయ్యారు. ఆ తర్వాత దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్లను దేశంలో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అదేసమయంలో తొలిసారి రూ.2000 నోటుకు ప్రవేశపెట్టారు.
ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ఈ నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ తర్వాత జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చారు.
ఇలా నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయి. వృద్ధిరేటు గణనీయంగా పడిపోయింది. పెట్రోల్, డీజల్ ధరలు ఆకాశానికి తాకాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పెరిగిపోయింది.
వీటిన్నింటి ప్రభావం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పినట్టు సమాచారం. ఈ కారణంగానే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ సుబ్రహ్మణ్యన్ కూడా రాజీనామా చేసిన విషయం తెల్సిందే.