శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 30 నవంబరు 2018 (08:46 IST)

చంద్రబాబుకు 'దేశం' ఎమ్మెల్యే షాక్.. పవన్ చెంతకు రావెల కిషోర్ బాబు

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి, ప్రత్తిపాటి ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు తేరుకోలేని షాక్ ఇవ్వనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన పార్టీ మారబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ జనసేన వైపు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. 
 
నిజానకి ప్రత్తిపాటి ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు కొంతకాలం సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆయనను మంత్రిపదవి నుంచి తొలగించారు. ఆయనతో పాటు మరికొందర్ని తొలగించారు. అప్పటి నుంచి రావెల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 
 
దీనికితోడు పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందని మథనపడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో ఇప్పటికే రెండుసార్లు సమావేశమై చర్చించారు. దీంతో డిసెంబరు ఒకటో తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు రావెల కిషోర్ బాబు సిద్ధమయ్యారు. 
 
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ వర్గాలు అప్రమత్తమయ్యాయి. రావెల కిషోర్ బాబును బుజ్జగించేందుకు తమ వంతు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ బుజ్జగింపుల కారణంగా ఆయన వెనక్కి తగ్గుతారా లేదా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జనసేనలో చేరుతారా అన్నది తెలియాల్సివుంది.