శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 25 నవంబరు 2018 (09:35 IST)

కన్నడ రెబల్ స్టార్‌.. సుమలత భర్త అంబరీష్ కన్నుమూత

కన్నడ నటుడు, ప్రముఖ సినీ నటి సుమలత భర్త అంబరీష్ (66) కన్నుమూశారు. కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 29 మే 1952 అప్పటి మైసూర్ రాష్ట్రం మాండ్య జిల్లాలోని దొడ్డరసినకెరెలో అంబరీష్ జన్మించారు. అసలు పేరు గౌడా అమర్‌నాథ్. 1972లో ప్రఖ్యాత కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్ రూపొందించిన ''నాగరాహవు'' సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టారు. 
 
కన్నడ రెబల్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న అంబరీష్ 200పై చిలుకు చిత్రాల్లో నటించారు. 1991లో సినీ నటి సుమలతను అంబరీష్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2013లో కాంగ్రెస్ తరపున కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపును నమోదు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. అంబరీష్ మృతితో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. 
 
అంబరీష్ మృతితో కన్నడ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. కాంగ్రెస్ నేతలు అంబరీష్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు నివాసానికి చేరుకుంటున్నారు.