శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (17:44 IST)

#Metoo ప్రకంపనలు- కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ రాజీనామా

కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు మీద పరువునష్టం కేసు వేశారు.

కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు మీద పరువునష్టం కేసు వేశారు. దేశాన్ని అట్టుడికిస్తున్న #Me too ఉద్యమంలో భాగంగా జర్నలిస్ట్ ప్రియా రమణి ఆయనపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా పరువునష్టం దావా వేసినా వెనక్కి తగ్గేది లేదని కోర్టులో తేల్చుకుంటానని ప్రియా రమణి ఛాలెంజ్ విసిరారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి ఎంజె అక్బర్ బుధవారం నాడు రాజీనామా చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఎంజె అక్బర్ పనిచేస్తున్నారు. మీటూలో భాగంగా ప్రియా రమణితో పాటు కొందరు మహిళా జర్నలిస్టులు అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను అక్బర్ ఖండించారు. 
 
ఇంతలో ఏమైందో ఏమోకానీ.. అక్బర్ బుధవారం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనకు విదేశాంగ సహాయ మంత్రి బాధ్యతలు కట్టబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఈ సందర్భంగా అక్బర్ ధన్యవాదాలు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కోర్టులో ఈ విషయాన్ని తేల్చుకొనేందుకు వీలుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. 
 
అయితే మీటూ ఉద్యమంలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మంత్రి పదవిలో కొనసాగించడం ఏమిటని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నెటిజన్లు ప్రశ్నించడంతో.. ప్రధాని ఒత్తిడి మేరకు అక్బర్ రాజీనామా చేసి వుంటారని టాక్ వస్తోంది.