మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2019 (12:34 IST)

యాదవ కులంపై అనుచిత వ్యాఖ్యలు.. పెయిడ్ ఆర్టిస్ట్ అరెస్టు

వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలను నమ్మించేందుకు రైతు వేషం ధరించి, ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పైనా, యాదవ కులంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడు. 
 
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన చంద్రశేఖర్... జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేసే పెయిడ్‌ పబ్లిసిటీ బృందంలో కీలకంగా ఉన్నాడు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటనల్లో కూడా నటించాడు. ఇటీవల వరద సమయంలో రైతు వేషం కట్టి… తానే ఒక రైతును అని ప్రజలను నమ్మించడం ద్వారా రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్న భావన కలిగించేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నటించాడు. 
 
దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో తాము కుట్రలో భాగంగానే రైతు వేషం కట్టి ప్రభుత్వాన్ని తిట్టినట్టు అంగీకరించాడు. తనతో పాటు ప్రభుత్వంపై బురద జల్లేందుకు పలువురిని టీడీపీ ఉపయోగిస్తున్నట్టు చెప్పాడని సమాచారం.
 
వివిధ వర్గాల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులే ప్రభుత్వాన్ని తిట్టిపోసి… ఈ వీడియోలను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు జరుగుతున్న కుట్రను అతడు బయటపెట్టినట్టు చెబుతున్నారు.