వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే అమరావతిలో ఉంటారా? జగన్‌కు జీవీఎల్ సూటిప్రశ్న
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్.నరసింహా రావు సూటిగా ఓ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే అమరావతిలో ఉంటారా లేక హైదరాబాద్ లోటస్ పాండ్‌కు మకాం మారుస్తారా అంటూ నిలదీశారు.
ఆయన ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలతో ఇతర కంపెనీలను తరిమి వేయడం మినహా జగన్ సర్కారు సాధించిన ప్రగతి ఏంటని ఆయన ప్రశనించారు. రాష్ట్రంలో ఐటీ రంగం పూర్తిగా నాశనమైపోయిందన్నారు.
అంతేకాకుండా, కడప జిల్లా పులివెందులలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, తన పేరు జగన్ అని తాను ఇక్కడే ఉంటాననే డైలాగులు మరోమారు బాగా వినిపించారన్నారు. గతంలో అమరావతి విషయంలోనూ అదే చెప్పారని గుర్తుచేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందన్న మాటకు కట్టుబడి లేరని మరి ఈ మాటలకు గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు.
2024లో జగన్ ఓడిపోవడం ఖాయమని జీవీఎల్ జోస్యం చెప్పారు. అపుడు కూడా జగన్ అమరావతిలోనే ఉంటారా లేక హైదరాబాద్ లోటస్ పాండ్‌కు మకాం మార్చుతారా అనే విషయంపై జగన్ లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
పైగా, టీడీపీ, వైకాపా రెండూ దొందూదొందేనన్నారు. టీడీపీ, వైకాపా నేతలకు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తుందని, లేదంటే మనసంతా హైదరాబాద్ నగరంపైనే ఉంటుందని ఎద్దేవా చేశారు.