బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (15:54 IST)

ఛీ.. మీరు పాలకులా? శవాలపై పేలాలు ఏరుకునే రాక్షసులా? : చంద్రబాబు ఫైర్

chandrbabu
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన తురకా గంగమ్మ, పర్లయ్య దంపతుల కుమారుడు ఇటీవల చనిపోగా, ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షల పరిహారం ఇచ్చింది. ఈ సొమ్ములో తమకు రూ.2.50 లక్షలు ఇవ్వాలంటూ సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త డిమాండ్ చేశారు. దీంతో బాధితులు న్యాయం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబును ఆశ్రయించారు. ఆయన మరింత గదమాయిస్తూ, అడిగిన డబ్బులు ఇవ్వాల్సిందేనని, ఆయన వద్దన్నా తనకు కావాల్సిందేనటూ నిర్మొహమాటంగా చెప్పారని బాధితులు మీడియా ముందు వాపోయారు. ఈ వార్త ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
దీనిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు స్పందించారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "ఛీ.. మీరు పాలకులా.. శవాలపై పేలాలు ఏరుకునే రాక్షసులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా పత్రికల్లో వచ్చిన కథనం తాలూకూ క్లిప్పింగ్‌ను కూడా ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. 
 
మరోవైపు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కూడా ట్వీట్ చేసారు. మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. "నీకు మానవత్వం అనేది ఉందా? బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను పీక్కుతింటావా? పరిహారం సొమ్ములో సంగ కావాలా నీకు? అంటూ నిప్పులు చెరిగారు.