గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన... టీడీపీ చీఫ్ చంద్రబాబు
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు తొలగించారు. దీనిపై నలువైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అలాగే, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కూడా స్పందించారు. గుంటూరు మున్సిపల్ అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడిదలకేం తెలుసు గంధపు వాసన అనే సామెతను ఉటంకించారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
"గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని ఒక సామెత ఉంది. కరుడుకట్టిన దోపిడీ దొంగలకు దోచుకోవడం తప్ప కళల గురించి, కళాకారుల గురించి ఏం తెలుస్తుంది? అందుకే నిన్న ఎన్టీఆర్ వంటి మహానుభావుడిని అవమానించారు. ఈరోజు గాన గంధర్వుడిని అవమానించారు.
ఎస్పీ బాలు గారు మన తెలుగువాడు అని చెప్పుకోవడమే మనకు గర్వకారణం. అటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అనుమతి లేదంటూ తొలగించడం... ఇంకా ఘోరంగా తొలగించిన విగ్రహాన్ని మరుగుదొడ్డిలో పెట్టడం తెలుగుజాతికే అవమానకరం. ఇది తెలిసి మనసు చివుక్కుమంది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారిని అవమానించినందుకు ప్రభుత్వం వెంటనే తెలుగుప్రజలకు క్షమాపణ చెప్పి, బాద్యులపై చర్యలు తీసుకోవాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశారు.