సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2022 (09:08 IST)

గుంటూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు

spbalu statue
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు తొలగించారు. ఈ చర్య వివాదాస్పదంగా మారింది. ఈ విగ్రహాన్ని ఎస్పీబీ అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే, విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతులు లేవంటూ విగ్రహం ప్రతిష్టించిన మరునాడే ఈ విగ్రహాన్ని నగర పాలక సంస్థ అధికారులు తొలగించి తమ వక్రబుద్ధిని చూపించారు. 
 
జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి తెలియజేసే, ఆదివారం రాత్రి మిత్రుల సహకారంతో విగ్రహాన్ని లక్ష్మీపురం సెంటర్‌లోని మదర్‌ థెరెస్సా కూడలికి చేర్చామని కళాదర్బార్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు చెప్పారు. సోమవారం ఉదయం వెళ్లిచూడగా అక్కడి నుంచి తొలగించి, నగరపాలిక వాటర్‌ ట్యాంకర్ల ప్రాంగణంలో పడేశారని వాపోయారు. 
 
'విగ్రహం తొలగించవద్దంటూ అక్కడున్నవారు ప్రాధేయపడినా అధికారులు విన్లేదు. నగరంలో ట్రాఫిక్‌ రద్దీగా ఉండే డివైడర్లు, కూడళ్లల్లో నేతల విగ్రహాలను కొనసాగిస్తూ, బాలు విగ్రహాన్ని తొలగించడమేంటి? రాకపోకలకు అడ్డుగా లేనిచోటే పెట్టాం. ఇంకా ముసుగు తొలగించలేదు. అనుమతి కోసం మేం రెండేళ్లుగా తిరుగుతున్నా, అధికారులు స్పందించలేదు' అని రంగారావు వాపోయారు. 
 
దీనిపై కార్పొరేషన్‌ ప్రణాళికాధికారి జీఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ 'కోర్టుల ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లు, రహదారుల్లో విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు. బాలు విగ్రహం పెట్టిన ప్రదేశం నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటుంది. దానికి అనుమతి లేనందునే తొలగించామ'ని ఆయన తెలిపారు.