ఎస్పీ బాలును అగౌరవపరచాలన్న ఉద్దేశ్యం కాదు : గుంటూరు కమిషనర్
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంను అగౌరవపరచాలన్న ఉద్దేశ్యంతో ఆయన విగ్రహాన్ని తొలగించలేదని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తి అన్నారు.
గుంటూరులో ఎస్పీబీ అభిమానులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని మదర్ థెరీస్సా జంక్షన్‌లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే, ఈ కూడలి రద్దీ ప్రాంతంగా పేర్కొంటూ ఎస్పీబీ విగ్రహాన్ని పోలీసుల అండతో నగర పాలక సంస్థ అధికారులు తొలగించారు.
దీంతో కార్పొరేషన్ అధికారులపై కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తి స్పందించారు. 'నగరంలో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుపై అపోహలు వచ్చాయి. 2021 జూన్ 5న నాజ్ సెంటర్లో బాలు విగ్రహం ఏర్పాటుకు కార్పొరేషన్ అనుమతిచ్చిందని తెలిపారు.
అయితే, అనుమతించిన ప్రదేశంలోకాకుండా మదర్ థెరీసా సెంటర్‌లో విగ్రహం పెట్టారు. అనుమతిలేని చోట విగ్రహం ఏర్పాటు చేయడంతో తొలగించాం. నాజ్ సెంటర్‌లో విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కళా దర్బార్ వారికి చెప్పాం. బాలు గారిని అగౌరవపర్చాలని విగ్రహం తొలగించలేదు. అనుమతిచ్చిన ప్రాంతంలోనే విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి అని సూచించారు.