త్రివిక్రమ్ - వెంకటేష్ చిత్రానికి టైటిల్ ఖరారు.. ఏంటంటే...
మాటల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‍లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేశారు. గతంలో ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించిన వెంకటేష్ మరోమారు ఆ తరహా చిత్రంలో నటించనున్నారు. అందుకే ఈ చిత్రానికి "ఆదర్శ కుటుంబం హాస్ నంబర్ 47" (ఉప శీర్షిక ఏకే 47) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈప్రాజెక్టును అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఎన్నో రకాలైన పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టినప్పటికీ వీటికి తెరదించుతూ కొత్త టైటిల్‌ను ప్రకటించారు.
అలాగే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి ప్రారంభమైనట్లు తెలుపుతూ వెంకటేశ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. వచ్చే ఏడాది వేసవిలో దీన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. తాజాగా పంచుకున్న ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో వెంకటేశ్ సింపుల్‌లుక్‌లో మధ్యతరగతి వ్యక్తిగా ఆకట్టుకుంటున్నారు.
గత సంక్రాంతి పండుగకు వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ తర్వాత వెంకటేశ్ సోలోగా నటిస్తున్న సినిమా ఇదే. వెంకటేశ్ కథానాయకుడిగా ఇదివరకు వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలకు త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ని అందించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
త్రివిక్రమ్ గత చిత్రాల్లాగే ఇందులోనూ ఇద్దరు నాయికలకు అవకాశమున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ పాత్రల కోసం త్రిష, నిధి అగర్వాల్‌తో పాటు రుక్మిణీ వసంత్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఇదిలావుంటే, చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో రానున్న 'మన శంకర వరప్రసాద్'లో అతిథి పాత్రలో కనిపించనున్నారు. అలాగే 'దృశ్యం-3'తో మరోసారి థ్రిల్ పంచనున్నారు.