ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 21 మే 2020 (06:09 IST)

మహిళలను వేధింపులకు గురిచేస్తే క‌ఠిన చర్యలు: మంత్రి తానేటి వనిత

మహిళలను వేధింపులకు గురిచేసిన వారిపై క‌ఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హెచ్చరించారు. రాజమహేంద్రవరం సరూరల్ మండలం బొమ్మూరు గ్రామంలో ఉన్న మహిళా ప్రాంగణంలో ఉన్న స్వధార్ కేంద్రంలో ఉంటున్న యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలుసుకున్న మంత్రి తానేటి వనిత స్వధార్ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా బాధిత మహిళలతో ఆమె మాట్లాడారు. అనంతరం మంత్రి విలేక‌రుల‌తో మాట్లాడుతూ దోషులను ఖఠినంగా శిక్షిస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, మహిళలపై అరాచకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనన్నారు.

బొమ్మూరు స్వధార్ హోమ్ లో ఎనిమిది మంది యువతులు ఆస‌రా పొందుతున్నారని, వీరిలో నలుగురుపై వాచ్‌మెన్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో అతనని అరెస్టు చేయడం జరిగిందన్నారు. దీనిపై నిర్లక్ష్య వైఖరి చూపిన సంబంధిత వ్యక్తుల అధికారులపై తక్షణ చర్యలు చేపడతామన్నారు. అక్కడ ఉన్న యువతకులను వేరే చోట‌కు తరలిస్తామన్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి రిపోర్టులు, విచారణ సమాచారం రాగానే ప్రభుత్వ సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఇటువంటి హోమ్‌ల వద్ద వాచ్‌మెన్‌ను స్త్రీలను నియమించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ స్వధార్ హోమ్‌లో యువతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా న్యాయం జరుగుతుందని, మహిళలకు రక్షణ కోసం దిశ చట్టం ఎంత‌గానో ఉపయోగపడుతుందన్నారు. నిందితులకు క‌ఠిన శిక్షలు తప్పవన్నారు.

పర్యటనలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైకాపా నాయకులు ఆకుల వీర్రాజు, జక్కంపూడి విజయలక్ష్మి, నందెపు శ్రీనివాస్, పోలు విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అభిషిక్ కిషోర్, ఐసిడిఎస్ పిడి కె.సుఖజీవన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.