బిటెక్ చదివాడు, ఆ ఆటతో లక్షలు సంపాదించడం అలవాటు చేసుకుని.. చివరకు..?
బిటెక్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేశాడు. జీతం చాల్లేదని కోడిపందాలు మొదలుపెట్టాడు. పోలీసులు ఊరుకుంటారా.. పట్టుకుని తిన్నగా తీసుకెళ్ళి జైల్లో వేయడంతో కుర్రోడు కథ అడ్డం తిరిగింది. బాగా చదువుకున్న వ్యక్తి ఇలా ఎందుకు మారాడా అని పోలీసులు విచారణ ప్రారంభించారు.
గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం నంబూరు ప్రాంతానికి చెందిన బలరామిరెడ్డి బి.టెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కూడా వచ్చింది. అయితే నెల మొత్తం ఉద్యోగం చేస్తే వచ్చే జీతం మనోడికి సరిపోలేదు. వెంటనే ఉద్యోగానికి రిజైన్ చేసి సొంత ఊరికి వచ్చాడు. పందెం కోళ్ళ పెంపకాన్ని మొదలుపెట్టాడు.
పందెం కోళ్ళు కొనుగోలు చేసేందుకు వచ్చే వారితో పరిచయం ఏర్పడింది. కోళ్ళ పెంపకం, అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం కూడా సరిపోలేదు. అందుకే భారీగా డబ్బులు సంపాదించడానికి పక్కాగా స్కెచ్ వేశాడు. ప్లాన్ రివర్స్ అయ్యి కటకటాల పాలయ్యాడు. కోడి పందేలపై వస్తున్న డబ్బును కళ్ళారా చూశాడు బలరామిరెడ్డి.
కోళ్ళ పెంపకం జరిగే ప్రాంతంలో పందేలు నిర్వహిస్తే భారీగా ఆదాయం వస్తుందని భావించాడు. నంబూరులోనే కోడి పందేలు నిర్వహించడం స్టార్ట్ చేశాడు. పందెం రాయుళ్ళకు ఏమాత్రం లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేవాడు. నెమ్మదిగా కోడిపందేలతో ఆదాయం కూడా పెరిగింది.
పందెం కోళ్ళు పెంచేందుకు ఏర్పాట్లు కూడా చేశాడు. గుట్టుచప్పుడు కాకుండా బాగానే పందెం ఆడేవాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి బలరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను చెడిపోవడమే కాదు తనతో పాటు చదువుకున్న వారిని ఈ ఊబిలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నాడట బలరామిరెడ్డి.