గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (08:27 IST)

పేపర్ ప్లేట్ల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం - ముగ్గురి సజీవదహనం

rtcbus catch fire
చిత్తూరు జిల్లాలో ఘోర విషాదం జరిగింది. పేపర్ ప్లేట్ల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తండ్రీ తనయులతో పాటు మొత్తం ముగ్గురు సజీవదహనమయ్యారు. పట్టణంలోని రంగాచారి  వీధిలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. భాస్కర్ (65) అనే వ్యక్తి తనకున్న రెండు అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నాు. రెండో అంతస్తులో భాస్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. 
 
ఈ క్రమంలో మంగళవారం రాత్రి వారు గాఢ నిద్రలో ఉండగా, కిందవున్న పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ నుంచి మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లో వ్యాపించి రెండో అంతస్తుకు వ్యాపించాయి. దీంతో తప్పించుకునే మార్గం లేక భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీ బాబు (35), కుమారుడి స్నేహితుడు బాలాజీ (25)లు మంటల్లోనే కాలిపోయారు. 
 
స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపకదళ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే, వారు వచ్చేసమయానికి మంటలు భవనాన్ని చుట్టిముట్టేసివున్నాయి. దీంతో అందులోని వారిని ప్రాణాలతో రక్షించలేక పోయారు. 
 
మంటలను అదుపు చేసిన తర్వాత తలుపులు బద్దలుగొట్టిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ముగ్గురూ అపస్మారక స్థితిలో పడి వున్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
కాగా, ఢిల్లీబాబు మంగళవారమే పుట్టిన రోజు జరుపుకున్నాడు. వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన స్నేహితుడు బాలాజీ రాత్రి అక్కడే ఉన్నాడు. ప్రమాదంలో అతడు కూడా మరణించాడు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.