మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జూన్ 2024 (11:21 IST)

చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం.. హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. భారీ జనం

Chandra babu Naidu
టీడీపీ నారా చంద్రబాబు నాయుడు మంత్రి మండలి ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద తెల్లవారుజాము నుంచే జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడారు.
 
భారీగా తరలిరావడంతో విజయవాడ-గన్నవరం హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. హైవేకి అనుసంధానించే అంతర్గత రహదారులన్నీ వందలాది బస్సులు, కార్లు, ఇతర వాహనాలతో నిండిపోయాయి. హైవేపై దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్న చాలా మంది ప్రజలు తమ వాహనాల నుండి దిగి కాలినడకన వేదిక వైపు వెళ్తున్నారు.
 
వేకువజాము నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమై ప్రేక్షకులను అలరించాయి. ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు నాయుడుతో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేనకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. బీజేపీ ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి దక్కనుంది.
 
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రజనీకాంత్, కె. చిరంజీవి, రామ్ చరణ్ వంటి అగ్ర నటులు ఉండటంతో వేదిక చుట్టూ దట్టమైన భద్రతా దుప్పటి కప్పారు.
 
భద్రతా ఏర్పాట్లలో భాగంగా దాదాపు 10 వేల మంది పోలీసులను మోహరించారు. మొత్తం 56 ఎకరాల విస్తీర్ణంలో ఐదు చోట్ల వాహనాల పార్కింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా మొత్తం 36 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వీటిలో మూడు గ్యాలరీలు వీవీఐపీలకు సంబంధించినవి. సభా కార్యక్రమాలను ప్రేక్షకులు చూసేందుకు వీలుగా గ్యాలరీల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.