శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణాలో కోలుకున్న తొలి కరోనా బాధితుడు... త్వరలో డిశ్చార్జ్

తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. ఈ వైరస్ బారినపడి చికిత్స తీసుకున్న బాధితుడు ఇపుడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతన్ని ఆస్పత్రి నుంచి త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నారు. అతని పేరు వెల్లడించకపోయినప్పటికీ... అతనికి 24 యేళ్ళ వయసుంది. చికిత్స అనంతరం ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో నెగెటివ్ అని తేలడంతో ఇంటికి పంపించారు. అయితే, మరోసారి నిర్ధారణకు అతడి నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించనున్నట్లు సమాచారం. 
 
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన ఈ యువకుడు దుబాయ్‌ వెళ్లి వచ్చి కరోనా బారినపడ్డాడు. అనంతరం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స, వైద్యుల నిరంతర పర్యవేక్షణతో క్రమంగా యువకుడి ఆరోగ్యం కుదుటపడింది. తొలి మూడు రోజులు ఎలా ఉంటుందో? ఏమౌతుందోనని ఆందోళన చెందిన వైద్యులు ఇప్పుడిక ఇబ్బంది లేదని నిర్ధారణకు వచ్చారు.
 
ఈ క్రమంలో బాధితుడి జ్వరం తగ్గి, బీపీ అదుపులోకి వచ్చింది. తాజాగా న్యూమోనియా తగ్గుముఖం పట్టడంతో నమూనాలు తీసి గాంధీ మెడికల్‌ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. నెగెటివ్‌ అని తేలడంతో ఆసుపత్రి వర్గాల్లో ఉత్సాహం వచ్చింది. 48 గంటల అనంతరం నమూనాలు సేకరించి పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపుతారు. అక్కడినుంచి నివేదిక నెగెటివ్‌ అని వస్తే సాధ్యమైనంత త్వరగా డిశ్చార్జి చేసే అవకాశముంది. ఇంటికి పంపినా 14 రోజులు ఐసోలేషన్‌ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచన చేస్తున్నారు.