సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 మార్చి 2020 (10:59 IST)

కేరళలో మరో కేసు : భారత్‌లో 40 కేసులో.. శతాధిక వృద్ధుడికి విముక్తి

కేరళలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 40కు చేరింది. తాజాగా కేరళకు చెందిన మూడేళ్ల బాలుడి రక్త పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో భారత్‌లో ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య 40కు చేరింది. 
 
ఇటీవల బాలుడి కుటుంబం ఇటలీ నుంచి భారత్‌కు వచ్చింది. ఈ కుటుంబంలోని వారందరికీ కరోనా సోకడం గమనార్హం. కరోనా పాజిటివ్ సోకిన బాలుడిని ఎర్నాకులం మెడికల్ కాలేజీలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి నిపుణులైన వైద్య బృందం పరిశీలిస్తోందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. 
 
కరోనా నుంచి శతాధిక వృద్ధుడికి విముక్తి 
చైనాలో కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఈ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా కరోనా వైరస్ సోకిన వందేళ్ల వృద్ధుడు దాని నుంచి పూర్తిస్థాయిలో బయటపడడం చైనాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 
 
కోవిడ్ 19 లక్షణాలతో బాధపడుతూ వూహాన్‌కు చెందిన వందేళ్ల వృద్ధుడు ఒకరు గత నెల 24న హుబెయిలోని మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఆసుపత్రిలో చేరాడు. ఫ్లూ తరహా లక్షణాలతో పాటు అల్జీమర్స్, బీపీ, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అతడికి వైద్యులు 13 రోజుల పాటు చికిత్స అందించారు. 
 
తాజాగా, అతడిని పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలు లేవని నిర్ధారించారు. దీంతో అతడితోపాటు కోలుకున్న మరో 80 మందిని కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కరోనా వైరస్ నుంచి బయటపడిన అతి పెద్ద వయస్కుడిగా ఆ వృద్ధుడు రికార్డు సృష్టించాడు.
 
వూహాన్‌లో తొలిసారి వెలుగుచూసిన ఈ వైరస్ చైనాలో ఇప్పటి వరకు దాదాపు మూడు వేలమందికి పైగా పొట్టనపెట్టుకుంది. 80 వేల మందికిపైగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. అలాగే, 70 దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. మన దేశంలో 40 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.