శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (15:04 IST)

ప్రియుడుతో కలిసి భర్త మెడకు టవల్ చుట్టి చంపేసిన భార్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కాదని మరో పురుషుడి వ్యామోహంలో పడి కట్టుకున్న వాడిని హతమార్చింది. పోలీసులకు చిక్కి కన్నబిడ్డలను అనాథలను చేసింది. హత్యోదంతాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా కట్టుకథలు అల్లింది.  తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మదనాపురం మండలం గోపన్‌పేటకు చెందిన ఆంజనేయులు (31) 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి గచ్చిబౌలి సమీపంలోని గోపన్‌పల్లి తండాలో నివాసం ఉంటూ అక్కడే డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం ఆంజనేయులుకి మొదటి వివాహం అయింది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. 9 ఏళ్ల క్రితం సుహాసిని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 
 
వారి ప్రేమకు గుర్తుగా వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. కొంత కాలంగా రమేష్ అనే వ్యక్తితో సుహాసిని సన్నిహితంగా ఉండటం గమనించిన ఆంజనేయులు భార్యను నిలదీశాడు. చాలామార్లు గొడవలు కూడా జరిగాయి. ఇదే విషయంలో సోమవారం కూడా గొడవపడ్డారు. అదే రోజు రాత్రి ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ఇద్దరూ కలిసి మెడకు టవల్ చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. 
 
భర్తను చంపేసిన విషయం గోప్యంగా ఉంచి మంగళవారం మధ్యాహ్నం మృతదేహాన్ని ఆటోలో మదనాపురం మండలం గోపన్‌పేటకు తీసుకువచ్చింది. కల్లుతాగి కింద పడి మృతి చెందాడని తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను నమ్మించింది. బుధవారం అంత్యక్రియలు జరుగుతుండగా కుటుంబ సభ్యులు శవం మెడపై గాయాలను గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు సుహాసినిని తమదైన రీతిలో విచారించగా నేరాన్ని అంగీకరించింది. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పుడు రమేష్ కోసం గాలిస్తున్నారు.