సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 జనవరి 2024 (17:00 IST)

సాక్షి పత్రికలో నాకూ భాగముంది... ఏం పీక్కుంటారో పీక్కోండి... : వైకాపా నేతలకు షర్మిల కౌంటర్

ys sharmila
తాను ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సాక్షి పత్రికలో రోజుకో రీతిలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఇపుడున్న జగన్ ఎవరో తనకు తెలియదన్నారు. గతంలో ఉన్న జగన్ తనకు అన్న అని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారని చెప్పారు. రక్తం పంచుకుని పుట్టిన తనపై రోజుకొక దొంగతో జగన్ తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అత్యంత నీచంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరెన్ని విధాలుగా ప్రచారం చేసినా భయపడే ప్రసక్తే లేదని, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
కడప తాను పుట్టిన ఇల్లు అని షర్మిల అన్నారు. జగన్ మాదిరి తాను కూడా ఇక్కడే పుట్టానని, జమ్మలమడుగు ఆస్పత్రిలోనే జన్మించానని చెప్పారు. జగన్‌కు, పార్టీకి తాను చేసిన సేవలు వైకాపా కార్యకర్తలకు, నేతలకు గుర్తులేవన్నారు. తనమీద రోజుకొక కథ అల్లుతున్నారని మండిపడ్డారు. తనపై బురద చల్లేందుకు రోజుకొక జోకర్‌ను తెరముందుకు తీసుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. 
 
ఈ ఎన్నికల్లో జాతకాలు మారాలని అన్నారు. విలువలు, విశ్వసనీయతలు మీకు లేవా? అని ఆమె ప్రశ్నించారు. తాను రాజశేఖర్ రెడ్డి కుమార్తెను వైఎస్ షర్మిలా రెడ్డి అని, ఇదే తన ఉనికి అని చెప్పారు. అంతేకాకుండా, సాక్షి మీడియాలో జగన్‌తో సమానంగా తనకు కూడా భాగస్వామ్యం ఉందని ఆమె చెప్పారు. తన తండ్రి సాక్షిలో జగన్‌కు తనకు సమానంగా వాటా ఉండాలని భావించారని అన్నారు.