1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 12 జులై 2021 (21:36 IST)

అవార్డు తీసుకుంటే, లొంగిపోయిన‌ట్లే: జ‌ర్న‌లిస్ట్ సాయినాథ్

ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన వార్త‌లు రాసే, త‌ప్పొప్పులను బ‌య‌ట‌పెట్టే జ‌ర్న‌లిస్టులు అవార్డులు స్వీక‌రిస్తే, అది వారికి లొంగిపోయిన‌ట్లే అని జ‌ర్న‌లిస్ట్ సాయినాథ్ పేర్కొన్నారు. ఇటీవ‌ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త‌న‌కు ప్రకటించిన వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును జర్నలిస్ట్ పీ.సాయినాథ్ తిర‌స్క‌రించారు.

జ‌ర్నలిస్టుల వృత్తి ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను బయట పెట్టడం అని, అవార్డులు తీసుకుంటే లొంగిపోవడం అని ఆయ‌న అభివ‌ర్ణించారు. జ‌ర్న‌లిస్టులు ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌కు ఎక్స్ట‌ర్న‌ల్ ఆడిట‌ర్ల లాంటి వార‌ని, అందుకే, ప్ర‌భుత్వ ప్ర‌భావానికి లోను కావ‌ద్ద‌న్నారు.

ఇటీవ‌ల వైఎస్సార్ జ‌యంతి సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వం వివిధ రంగాల్లో 63 మందికి వైఎస్ ఆర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును ప్ర‌క‌టించింది. గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా వ్య‌వ‌సాయ రంగం, చేతి వృత్తుల విభాగంలో ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. గతంలో సాయినాథ్, మోడీ ప్రభుత్వం యొక్క వ్యవసాయ భీమా మోసం గురించి అనేక పరిశోధనాత్మక కథనాలను రాశారు. అయితే, ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అవార్డును సాయినాధ్ వెంట‌నే తిర‌స్క‌రించారు.