గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (08:22 IST)

డ్రగ్స్‌ కేసుపై లోతైన విచారణ : విశాఖ సీపీ

విశాఖలో వెలుగుచూసిన డ్రగ్స్‌ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు జరుపుతున్నామని  పోలీసు కమీషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నలుగురు నిందితుల్లో ఒకరైన మానుకొండ సత్యనారాయణ గతంలో రేవ్‌పార్టీ కేసులో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు.

సత్యనారాయణ, అతని స్నేహితుడు అజయ్‌ బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకువచ్చినట్టు గుర్తించామని వెల్లడించారు. వీరు తీసుకొచ్చిన డ్రగ్స్‌కు మూలాలు బెంగళూరులో ఎక్కడున్నాయో గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ డ్రగ్స్‌ కేసులో బెంగళూరు, గోవా పోలీసులు సహకారం తీసుకుంటామని చెప్పారు.

కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడతామన్నారు. నగరంలో జరిగే పుట్టిన రోజు పార్టీలకు సరఫరా చేసేందుకు డ్రగ్స్‌ తీసుకువచ్చినట్టుగా తెలుస్తోందన్నారు.

నిందితులు యువతను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగిస్తున్నారని చెప్పారు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డవారిని గుర్తించి వారికి డీఎడిక్షన్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తామని తెలిపారు.

సత్యనారాయణ కదలికలపై నిఘా పెట్టడం వల్లే డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టైందన్నారు. సత్యనారాయణపై మూడు కేసులు ఉన్నాయని వెల్లడించారు.