కరోనా వ్యాక్సినేషన్ల విషయంలో ఏపీ రికార్డు.. ఒకే రోజు 6.40లక్షల మందికి..?  
                                       
                  
				  				  
				   
                  				  ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాక్సినేషన్ల విషయంలో రికార్డు సాధించింది. ఏపీలో ఒకే రోజు 6.40 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశారు. టీకా వచ్చిన 24 గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేశారు. దేశవ్యాప్తంగా 31.39 లక్షల మందికి టీకా వేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానమని అధికారులు తెలిపారు. కేంద్రం తగినంత ఇస్తే నెలకు కోటిన్నర మందికి టీకా వేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 
				  											
																													
									  
	 
	సచివాలయాల సిబ్బంది సహకారంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అలాగే అదనపు వ్యాక్సిన్లు కావాలని ఏపీ అధికారులు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో రోజుకు 6 లక్షల డోసులు వేసే సామర్థ్యం వుందని అధికారులు తెలిపారు. 
				  
	 
	ఏపీకంటే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలు సైతం ఒక్క రోజులో ఏపీలో వేసినంత వేగంగా వ్యాక్సిన్ వేయలేకపోయాయి. ఇతర ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదు. 6.40 లక్షల డోసుల్లో 4.40 లక్షల డోసులు కోవిషీల్డ్, 2 లక్షల డోసులు కోవాగ్జిన్ ఉన్నాయి. 45 ఏళ్లు దాటిన వారి నుంచి ఆపైన వయసున్న వారికి వ్యాక్సిన్ వేశారు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పీహెచ్‌సీ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో టీకా ప్రక్రియ కొనసాగించారు. మొత్తం 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 255 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయాల్లో వ్యాక్సిన్ వేశారు. 
				  																		
											
									  
	 
	ఈ నెల 13న రాష్ట్రానికి వచ్చిన 6.40 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఒకే రోజు జిల్లాలకు.. అక్కడ నుంచి పీహెచ్‌సీలకు, అక్కడ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు చేర్చారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు టీకా ప్రక్రియ కొనసాగించారు. ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లు, సిబ్బంది సహకారంతో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ వేయగలిగారు.