మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:33 IST)

27న భారత్‌ బంద్‌: టిడిపి సంఘీభావం

సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు ఈ నెల 27న జరిగే భారత్‌ బంద్‌కు టిడిపి సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అన్నదాతలకు అండగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు నిర్వహించనున్న భారత్‌బంద్‌కు సంఘీభావం తెలపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 27న నిర్వహించనున్న రైతుల, కార్మికుల, ఉద్యోగుల భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని పలు రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి.

మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మిక హక్కులను రక్షించాలని, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని కోరాయి. విజయవాడలో కాంగ్రెస్‌ ఎపి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై వివిధ రాజకీయ పార్టీల వర్చువల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. కేంద్రం కరోనాను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

ఆర్థిక పరిస్థితి దిగజారి కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారని విమర్శించారు. ఎపిసిసి అధ్యక్షులు డాక్టర్‌ సాకే శైలజానాధ్‌ మాట్లాడుతూ కేంద్రం పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను నిరంతరం పెంచి దేశ ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతోందని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు తదితర ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా అదాని, అంబానీలకు కట్టబెడుతున్నారన్నారు.

విసికె నాయకులు ఎన్‌జె విద్యాసాగర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిపై కేంద్ర ప్రభుత్వం పెగాసస్‌ నిఘా పెట్టిందని అన్నారు. ఐయుఎంఎల్‌ నాయకులు బషీర్‌ మాట్లాడుతూ మోడీ పాలనలో మహిళలు, గిరిజనులు, దళితులపై దాడులు పెరిగాయన్నారు.

ఆదాయ పన్ను పరిధి వెలుపల ఉన్న కుటుంబాలకు నెలకు రూ.7,500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌ఎస్‌పి నాయకులు జానకి రాములు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికుల హక్కులకు రక్షణ కల్పించాలని, ఉపాధి హామీ కింద 200 పని దినాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.