బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:20 IST)

దేశంలోనే వినూత్నం ‘జగనన్న సంక్షేమ క్యాలెండర్’: మంత్రి పేర్ని నాని

దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా, వినూత్నంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏ మాసంలో ఏ యే పథకాలు అమలు చేస్తున్నామో చెబుతూ జగనన్న సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసినట్లు రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు.

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నెలలవారీగా అమలు చేసే పథకాలు వివరాలను ప్రజలకు వివరించడమే ఈ సంక్షేమ క్యాలెండర్ ప్రధాన ఉద్దేశమన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

తీవ్ర ఆర్థిక ఒడిదిడుకులున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారన్నారు. సీఎం జగన్ చెప్పారంటే...చేస్తారు... అనే విషయం ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిందన్నారు. ఏప్రిల్ 2021 నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఏ నెలలో ఏయే పథకాలు అమలు చేస్తున్నామో ప్రజలకు స్పష్టమైన సమాచారమివ్వడానికి జగనన్న సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. ఇదో వినూత్న కార్యక్రమమని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానం అమలు చేయలేదని మంత్రి తెలిపారు. 

జగనన్న సంక్షేమ క్యాలెండర్....
వరుస సంఖ్య నెల అమలయ్యే సంక్షేమ పథకాలు
1 ఏప్రిల్ జగనన్న వసతి దీవెన మొదటి విడత
జగనన్న విద్యా దీవెన మొదటి విడత
రబీ 2019కి రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు
డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ చెల్లింపు
2 మే రైతులకు 2020 ఖరీఫ్ పంటల బీమా
రైతు భరోసా మొదటి విడత
మత్స్యకార భరోసా
మత్స్యకార భరోసా(డీజిల్ సబ్సిడీ)
3 జూన్ వైఎస్సార్  చేయూత
జగనన్న విద్యా కానుక
4 జులై జగనన్న విద్యా దీవెన రెండో విడత
వైఎస్సార్ కాపు నేస్తం
వైఎస్సార్ వాహన మిత్ర
5 ఆగస్టు రైతులకు 2020 ఖరీఫ్ కు సున్నా వడ్డీ చెల్లింపులు
MSME, స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు
వైఎస్సార్ నేతన్న నేస్తం
అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు
6 సెప్టెంబర్ వైఎస్సార్ ఆసరా
7 అక్టోబర్ రైతు భరోసా రెండో విడత
జగనన్న చేదోడు(టైలర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు)
జగనన్న తోడు(చిరు వ్యాపారులు)
8 నవంబర్ ఈబీసీ నేస్తం
9 డిసెంబర్ జగనన్న వసతి దీవెన రెండో విడత
జగనన్న విద్యా దీవెన మూడో విడత
వైఎస్సార్ లా నేస్తం
10 జనవరి, 2022 రైతు భరోసా మూడో విడత
జగనన్న అమ్మఒడి
పెన్షన్ పెంపు నెలకు రూ.2,500
11 ఫిబ్రవరి, 2022 జగనన్న విద్యా దీవెన నాలుగో విడత
 
క్యాలెండర్ లో పేర్కొన్న సంక్షేమ పథకాలే కాకుండా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరు ముద్ద, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, పెన్షన్ కానుక వంటి ఇతర పథకాలు కూడా అమలు చేస్తామని మంత్రి పేర్నినాని తెలిపారు.

ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రవర్ణాల్లో 45 నుంచి 60 ఏళ్లు ఉన్న పేద మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. నిర్ధేశిత మాసాల్లో అమలయ్యే పథకాల వివరాలను ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో జగనన్న సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు.