ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (10:27 IST)

దేశంలోనే చిత్తూరు జిల్లా ఆదర్శం: చెవిరెడ్డి

కరోనా వంటి విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దేశంలోనే చిత్తూరు జిల్లా ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పద్మావతీ నిలయంలో కరోనా సేవలు ముగింపు కార్యక్రమాన్ని తుడా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథిగా తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. కరోనా కాలంలో విశిష్ట సేవలు అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్యులు, జర్నలిస్టులను చెవిరెడ్డి ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడారు.

జిల్లా యంత్రాంగం, టీటీడీ సంయుక్త సహకారంతో కరోనా వైరస్ వంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులు, ప్రజలలో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు మెరుగైన సేవలు అందించగలిగామని చెప్పుకొచ్చారు. సమిష్టి కృషితో ఇది సాధ్యమైందన్నారు.

కరోనా వచ్చిన తొలి రోజుల్లో బాధితులు మెరుగైన వైద్యం, ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ గుప్త గారి సతీమణి కరోనా తో మృతి చెందిన క్రమంలో వైద్య సేవల కోసం, ఆమెను కాపాడేందుకు ఆయన చేసిన ప్రయత్నం కలచివేసిందన్నారు.

ఈ పరిస్థితులు, పరిణామాల క్రమంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ గా ఏర్పాటై సేవలందించాలని నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు కమిటీలను పర్యవేక్షిస్తూ, బాధితులకు మెరుగైన సేవలందిస్తూ వచ్చామని తెలిపారు.

ప్రతి కమిటీ బాధ్యతగా పనిచేసిందని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో ప్రత్యేక ఆసుపత్రి, కమిటీ ఏర్పాటు వంటి పరిస్థితులకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా బాధితులకు ఆహ్లాదకర వాతావరణంలో వసతి, నాణ్యమైన ఆహారం, మందులు, ఇంటి వద్దనే కరోనా చికిత్స పొందదలుచుకుంటే మెడికల్ కిట్ వంటివి అందించినట్లు వెల్లడించారు.

వైద్య సలహాలు, సూచనల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు తో పాటు కరోనా బాధితులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలిపారు. కరోనా సమయంలో మనందరం చేసిన సేవలు సంతృప్తికరంగా నిక్షిప్తమై ఉంటాయన్నారు. త్యాగమూర్తులను సత్కరించుకోవడం నా వంతు బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. 
 
శ్రీ పద్మావతీ నిలయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు చక్కటి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేశారు. సాంసృతిక కార్యక్రమాలను వీక్షిస్తూ.. కరోనా బాధితులకు అందించిన సేవలను వైద్యులు, జర్నలిస్టులు గుర్తు చేసుకుంటూ విందును ఆరగించారు. శుక్రవారం నుంచి శ్రీ పద్మావతీ నిలయంలో కోవిడ్ సేవలు ముగిశాయని ప్రత్యేక అధికారిణి లక్ష్మీ పేర్కొన్నారు.