సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (23:14 IST)

కరోనా నివారణకు.. కార్మికశాఖ ఉద్యోగులకు సూచనలు

వెబ్ నార్(వీడియో కాన్ఫరెన్స్) ద్వారా అమెరికాకు చెందిన తెలుగు డాక్టర్ల అందించిన సలహాలు సూచనల పాటించడం ద్వారా కరోనా మహమ్మారి బారినపడకుండా కార్మిక శాఖ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యవంతమైన జీవనం పొందాలని రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి కోరారు.

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.జయరామ్ ఆధ్వర్యంలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన కర్నూలు నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జయరామ్ మాట్లాడుతూ, అమెరికా వైద్యులు అందించే సలహాలు సూచనల పాటిస్తూ కరోనా నుంచి కార్మిక శాఖకు చెందిన ఉద్యోగులంతా రక్షణ పొందాలని సూచించారు.

అనంతరం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా నివారణకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో చర్యలు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. దానిలో భాగంగా కార్మిక శాఖలో కరోనా నివారణకు శ్రీకారం చుట్టామన్నారు. అమెరికాకు చెందిన అయిదుగురు తెలుగు వైద్యులు( ఎం.డి. పలమనాజిస్టులు) డాక్టర్ సుధాకర్, డాక్టర్ లోకేష్, డాక్టర్ సురేష్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శ్రీకాంత్ తో తమ శాఖ ఉద్యోగులకు కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు సూచనలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన సదస్సు చేపట్టామన్నారు.

కేరింగ్ హెల్త్ సంస్థకు చెందిన డాక్టర్ సీఎల్ వెంకట్రావు, ఆర్టీఐ కమిషనర్ బీవీ రమణ కుమార్ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. లేబర్, పరిశ్రమలు, బాయిలర్, ఐఎంఎస్ శాఖలకు చెందిన 70 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారన్నారు. ఈ సందర్భంగా... పలువురు ఉద్యోగులు కరోనా నివారణ, పాజిటివ్ గా నిర్ధారణయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమెరికా వైద్యులను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరవాత ఇంటి వద్ద ఉండే వైద్య సేవలు ఎలా పొందాలి... తక్కువ ఖర్చుతో వ్యాధిని ఎలా నయం చేసుకోవాలి... ఐసోలేషన్ లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి...? అని అమెరికా వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

కరోనా నుంచి విముక్తి పొందిన తరవాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని, మానసికంగా ధృడంగా ఉండాలంటే ఏ చర్యలు తీసుకోవాలని, ఫిజికల్ థెరపీ ఎలా పొందాలని, కరోనా లక్షణాలు ఏస్థాయిలో ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరాలని..? అమెరికా వైద్యులను కార్మిక శాఖ ఉద్యోగులు అడిగి తెలుసుకున్నారు. కార్మిక శాఖ ఉద్యోగుల సందేహాల నివృత్తికి అమెరికా వైద్యులు సవివరంగా సలహాలు సూచనలు అందజేశారు.

భౌతిక దూరం పాటించడం, చేతులు  తరుచూ శుభ్రపరుచుకోవడం, మాస్కులు విధిగా ధరించడంతో పాటు మానసికంగా ప్రతి ఒక్కరూ ధృడంగా ఉండాలని, అప్పుడే కరోనా మహమ్మారిని తరిమికొట్టొచ్చునని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా కరోనా సోకినవారు ఎటువంటి భయాందోళనలకు గురికావొద్దన్నారు. ఈ వ్యాధి ఒక ఫ్లూ లాంటిదని, బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా త్వరగా ఆరోగ్యవంతులు కావొచ్చునని వైద్యులు... ఉద్యోగుల్లో భరోసా కల్పించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంతో విలువైన సమాచారం పొందామని ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు. అమెరికా వైద్యుల చేత కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు అందజేసేలా కృషి చేసిన మంత్రి జయరామ్ కు, ముఖ్యకార్యదర్శి ఉదయలక్ష్మికి, కేరింగ్ హెల్త్ సంస్థకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  కార్మిక శాఖకు చెందిన వెయ్యి మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారితో పాటు కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ జి.రేఖారాణి, అడిషనల్ కమిషనర్ అజయ్, డైరెక్టర్లు వర్మ, ఉమామహేశ్వరరావు, సామ్రాజ్యంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.