1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (06:34 IST)

ప్రతి జిల్లాలో 5 వేల బెడ్స్​తో ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలు: ఏపీ ప్రభుత్వం

లాక్​ డౌన్ ను రాష్ట్రంలో మరింత పకడ్బందీగా అమలు చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. వైద్యం, పారిశుద్ధ్యం అంశాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. రేషన్ పంపిణీ కేంద్రాలను పెంచబోతున్నట్టు వెల్లడించారు.

రాష్ట్రంలో లాక్ డౌన్​ను మరింత పటిష్టంగా అమలు చేయాల్సి ఉందని మంత్రి కురసాల కన్నబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కరోనా నివారణకు మరిన్ని కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. వైద్య పరమైన అంశాల్లో మరిని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులను సైతం వినియోగిస్తామని అన్నారు. ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల సంఖ్యను పెంచుతున్నామని... క్వారంటైన్ కేంద్రాల్లో పర్యవేక్షక ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలో 5 వేల బెడ్స్ సామర్థ్యంతో ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలోనూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రబీ పంట చేతికి వస్తోందని, ఈనేపథ్యంలో రైతులకు మిలర్లు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవని, రేషన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లు పెంచాలని నిర్ణయించామని చెప్పారు. 
 
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి..
క్షేత్రస్థాయిలోని బాధ్యతలను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని మంత్రి కన్నబాబు సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు చెప్పారు. ధరలు పెంచితే జైలుకే... నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపుతామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు.

జిల్లా జేసీలు ఈ అంశాన్ని పర్యవేక్షించాలని ఆదేశాలు ఇచ్చారు. విక్రేతలు బోర్డుల్లో ధరలు ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి పింఛను మొత్తాన్ని డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. వృద్ధులు, అనాథ, శిశు ఆలయాల్లో ఉచిత బియ్యం, కందిపప్పు అందిస్తామని అన్నారు.