శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (11:52 IST)

తూగో జిల్లాలో కరోనా కలకలం... ఏపీలో కాల్ సెంటర్

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వెలుగు చూసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాఫ్ట్‌వేర్ టెక్కీకి కరోనా వైరస్ సోకినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఏపీ ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
జిల్లాలోని కొత్తపేట మండలం వాడపల్లి గ్రామానికి చెందిన బండారు వెంకటేస్వర్లుకు కరోనా సోకినట్టు వస్తున్న అనుమానాలపై వైద్య పరీక్షలకు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో వెంకటేశ్వర్లుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. 
 
ఇదే అంశంపై కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని ఫోనులో మాట్లాడారు. కోన సీమ ప్రాంతంలో ప్రజలు ఆందోళన చేందొద్దని, ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. 
 
ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటల్‌లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సచివాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. 0866-2410978 నెంబర్‌కు ఫోన్ చేయవచన్నారు. వెంటిలేటర్లతో ప్రత్యేక వార్డును సిద్ధం చేసినట్టు మంత్రి ఆళ్ళనాని తెలిపారు.