బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (19:58 IST)

జగన్, కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాడంటే ప్రజలు నమ్ముతారా?: చెంగల్రాయుడు

జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఇళ్లపట్టాల పంపిణీ పథకాన్ని వాయిదాల మీద వాయిదాలు వేయడం జరిగిందని, 30లక్షల పైచిలుకు పట్టాల పంపిణీ పథకంలో ప్రభుత్వం చేసినంత  ఆర్బాటం, ఫలితాల్లో కనిపించడంలేదని  టీడీపీ అధికారప్రతినిధి చెంగల్రాయుడు తెలిపారు. ఆయన జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ...
 
గతంలో చంద్రబాబునాయుడు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాలు ఎంతవిస్తీర్ణంలో స్థలాలిచ్చారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతిస్తున్నాడో బేరీజు వేసుకోవాలి. గతప్రభుత్వాలు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను మాత్రమే పేదలకు ఇళ్లస్థలాలుగా ఇచ్చాయి. దేవాదాయ, వక్ఫ్ , మైనింగ్, ఇరిగేషన్ అటవీ భూములతో పాటు, పంచాయతీల పరిధిలోని భూములును ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పింది.

జగన్ ప్రభుత్వం ఇళ్లపట్టాల పంపిణీలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించింది. కొన్నిచోట్ల పాఠశాలల స్థలాలు, శ్మశానాలు, వాగు, చెరువుల స్థలాలు, పేదలకు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు తమకు నివాసయోగ్యంగా లేవని దాదాపు 10జిల్లాల్లో చెప్పడం జరిగింది. గతప్రభుత్వం ఇళ్లను స్వయంగా కట్టించి పట్టణప్రాంతాల్లోని పేదలకు కేటాయించింది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.2 నుంచి రూ.2.50లక్షలవరకు బ్యాంకురుణాలు లబ్ధిదారులకు కేటాయించింది. జగన్ పాదయాత్ర సమయంలో ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలిస్తానని చెప్పాడు. నర్సీపట్నంలో ఆయన పాదయాత్ర సమయంలో అలా చెప్పాడు. గతప్రభుత్వం రూ.2.50లక్షలు లబ్దిదారులకు ఇస్తే, జగన్ రూ.1.50లక్షలు ఇస్తానని చెబుతు న్నాడు. అదేవిధంగా 15.50లక్షల ఇళ్లను కట్టించి ఇస్తానని జగన్ చెబుతున్నాడు.

తనతండ్రి హయాంలో మాదిరి ఇళ్ల నిర్మాణాన్ని అవినీతికోసం వినియోగించకుండా, లబ్దిదారులపై అదనపు భారం లేకుండా నిర్మించి ఇస్తే మంచిది. గతప్రభుత్వంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి అందాల్సిన బకాయిలను చెల్లించని జగన్ ప్రభుత్వం, అదనంగా 15లక్షల ఇళ్లు నిర్మిస్తుందంటే నమ్ముతారా?  మొదటిభార్యకు అన్నంపెట్టని వ్యక్తి, రెండో భార్యకు బంగారు నగలు చేయిస్తానన్నట్లుగా జగన్ మాటలున్నాయి.

ఇళ్లునిర్మించుకున్న వారికి చెల్లించాల్సిన రూ.4వేలకోట్లనే తక్షణమే జగన్ ప్రభుత్వం చెల్లించాలి. ఇళ్లస్థలాలకు సేకరించిన భూములకొనుగోలు, మెరక వేయడం వంటి వాటితో జగన్  ప్రభుత్వం దాదాపు రూ.6,500కోట్ల వరకు దోచేసింది. సమగ్ర దర్యాప్తు జరిపితే అసలు దొంగలు బయటకు వస్తారు. జగన్ ఊళ్లను నిర్మిస్తున్నాడంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీనేతలు వాటికి జగనన్న చెరువుకాలనీ, శ్మశాన కాలనీ, జగనన్న అటవీకాలనీ వంటిపేర్లు పెడితే బాగుంటుంది.

ప్రభుత్వం ఏఉద్దేశంతో ఇళ్లు ఇవ్వాలనుకుంటుందో ఆ ఉద్దేశం ఎన్నటికీ నెరవేరదు. ప్రభుత్వం ఇచ్చే స్థలాలు నివాసానికి పనికిరానప్పుడు ప్రజలకు ఉపయోగం ఏముంటుంది? కాలనీలు నిర్మించేటప్పుడు దానిలో రోడ్లు, డ్రైనేజీలు, కమ్మూనిటీ హాళ్లు వంటివి నిర్మిస్తే, సెంటుస్థలంలో ప్రజలకు మిగిలేది ఎంత? 

కేంద్రప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడానికే ఇళ్లస్థలాల  పథకాన్ని వైసీపీవారు వినియోగించుకుంటున్నారు. ఎన్ఆర్ ఈజీ ఎస్ నిధులతో భూములచదును, రోడ్లు అంటూ అయినకాడికి కాజేస్తున్నారు. టిడ్కో ఆధ్వర్యంలో గతప్రభుత్వం పట్టణప్రాంతాల్లో 4లక్షల63వేల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి, 2లక్షల64వేల వరకు పూర్తిచేసింది. షీర్ వాల్ టెక్నాలజీ సాయంతో నిర్మాణాలు చేయడం జరిగింది.

చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,300లను టీడీపీ ప్రభుత్వం ఖర్చుచేసిందని చెప్పడం అవాస్తవం. కేవలం రూ.1650 మాత్రమే ఖర్చు చేశారు. మరో వెయ్యి రూపాయలు అదనంగా మౌలికవసతులకు వినియోగించారు.  టీడీపీప్రభుత్వం కట్టించి నంత గొప్పగా, వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక్కఇల్లు కట్టించా రా? బడ్జెట్లో రూ.3,600కోట్లు కేటాయించిన జగన్ ప్రభుత్వం ఆసొమ్ములో ఎంతఖర్చుచేసి పేదలకు ఇళ్లను నిర్మించింది.

బ్యాంకులకు ఇప్పటికీ వాయిదాలు కట్టుకుంటున్న లబ్దిదారులకు ఇళ్లను కేటాయించకపోబట్టే టీడీపీ నాఇల్లు- నాసొంతం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అన్నింటిలో రివర్స్ టెండరింగ్ లు పిలుస్తున్న ప్రభుత్వం టీడీపీప్రభుత్వం మొదలుపెట్టిన 4లక్షలపైచిలుకు ఇళ్లలో మిగిలిన2లక్షలను ఎందుకు పూర్తిచేయడం లేదు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలో అప్పులుచేసి  ఇళ్లు నిర్మించుకున్నవారికి చెల్లించాల్సిన బకాయిల ను ఎందుకు చెల్లించడంలేదు?

వాగుల్లో, చెరువుల్లో, శ్మశానాల్లో, డీకేటీ పట్టాల్లో ఇళ్లస్థలాలను ఇస్తే, న్యాయస్థానాలు చూస్తూ ఊరుకుంటాయా? న్యాయస్థానాలను దిక్కరించింది చాలక, అధికారపార్టీ ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా ఇప్పటికీ కోర్టులను తప్పపడుతున్నారు. ఆవభూములు, మడభూములు, అసైన్డ్ ల్యాండ్స్ ని  ఇళ్లపట్టాలకు ఇవ్వడంపైనే కొందరు కోర్టులకు వెళ్లారు. 

జగన్ పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాలపై కేవలం 5శాతంభూములపై మాత్రమే కోర్టుల్లో వివాదాలు ఉన్నాయి. ఆ విషయం ఇళ్లపట్టాల పంపిణీ బహిరంగ సభలో ముఖ్యమంత్రే ఒప్పుకున్నాడు. ముఖ్యమంత్రి అన్నీ సజావుగా సక్రమంగా చేస్తే ఎవరూ కావాలని కోర్టులకు వెళ్లరు కదా? ఇళ్లస్థలాల కేటాయింపులో అర్హులకు అన్యాయం జరిగిందని అర్థమవుతోంది.

అక్కడక్కడా జరుగుతున్న ఆందోళనలే అందుకు నిదర్శనం. ఇళ్లపట్టాల పంపిణీ వ్యవహారంపై పూర్తిసమాచారంతో వైసీపీప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను.