శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (23:31 IST)

జగన్ రూపాయితో విలాసవంతమైన జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నాడో?: సప్తగిరిప్రసాద్

చంద్రబాబు హాయాంలో రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయని, పండుగనాడు ప్రతిపేదవాడు పాయసం తినాలనే సదుద్దేశంతో, తెల్లరేషన్ కార్డు కలిగిఉన్న ప్రతిఒక్క క్రైస్తవ కుటుంబానికి క్రిస్మస్ కానుకరూపంలో పండగ సరుకులను ఉచితంగా అందచేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని టీడీపీ అధికారప్రతినిధి సప్తగిరి ప్రసాద్ స్పష్టంచేశారు.

శుక్రవారం ఆయన తననివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక క్రిస్మస్ కానుకలు ఏమయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటంకోసం చంద్రబాబునాయుడు పనిచేస్తే, జగన్ పాలన అందుకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లపాటు క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ తోఫాల రూపంలో ఆయా పండుగలసమయంలో శెనగపిండి, గోధుమపిండి, నెయ్యి, పంచదార, బెల్లం వంటి సరుకు లను అందచేయడం జరిగిందన్నారు.

ఆవిధంగా ఖర్చుచేయడానికి ఏటా ప్రభుత్వానికి రూ.30కోట్ల కన్నా ఎక్కువఖర్చు కావన్న ప్రసాద్, జగన్ ప్రభుత్వం మాత్రం ఆ సొమ్ముకూడా లేదని అబద్దాలు చెబుతూ, ప్రకటనలరూపంలో కోట్లాదిరూపాయల ప్రజలసొమ్ముని సాక్షిపత్రికకు దోచిపెడుతోందన్నారు.

19నెలల జగన్ పాలనలో రూ.200కోట్లవరకు అబద్ధాల ప్రకటనలరూపంలో సాక్షిపత్రికకు వైసీపీప్రభుత్వం దోచిపెట్టిందన్నారు. ఆ సొమ్మంతా జగన్ కు ఎక్కడినుంచి వచ్చిందో సమాధానం చెప్పాలని సప్తగిరిప్రసాద్ డిమాండ్ చేశారు.

తనపార్టీల రంగులువేయడానికి, సాక్షిపత్రికకు ప్రకటనలు ఇవ్వడానికి ప్రభుత్వందగ్గర డబ్బులున్నాయికానీ, ప్రజలకు పండుగసరుకులు అందించడానికి మాత్రం డబ్బులు లేవని జగన్మోహన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటన్నారు.

జగన్ పాలనలో కాంట్రాక్టర్లకు, వైసీపీకార్యకర్తలకు, వాలంటీర్లకుమాత్రం రోజూ పండగేనని, సాక్షిపత్రిక కూడా నిత్యకళ్యాణం పచ్చతోరణంలా వెలిగిపోతోందని, ఎటొచ్చీ పేదలుమాత్రం పస్తులుతో చచ్చిపోతు న్నారని టీడీపీనేత వాపోయారు. 

విద్యుత్ ఛార్జీల పెంపుదల, ఆర్టీసీఛార్జీలు, ఇసుకధరలు, రేషన్ సరుకులు, ఆస్తిపన్ను, నీటిపన్ను, వృత్తిపన్నులు పెంచడం ద్వారా పేదలకు జగన్ ప్రభుత్వం సరికొత్త పండుగకానుకలు ఇచ్చిందన్నారు.

పేదలపై ధరల భారంమోపి, వారికి సంతోషాన్ని దూరంచేసిన జగన్మోహన్ రెడ్డి, పేదలు పండుగచేసుకుంటున్నారో లేదోననే ఆలోచన లేకుండా తానుమాత్రం క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాడన్నా రు. కేంద్రం నుంచి రేషన్ దుకాణాలకు వచ్చే కందిపప్పుపై ధరలు పెంచకుండా, రాష్ట్రప్రభుత్వమే మార్క్ ఫెడ్ నుంచి కందులుకొని, పప్పువేయించి పేదలకు పంచవచ్చుకదా అని ప్రసాద్ ప్రశ్నించారు.

జగన్ ప్రభుత్వంలో నెలాఖరు వచ్చేసరికి రూ.లక్ష జీతం తీసుకునే వాడుకూడా నానా అవస్థలు పడుతున్నాడని, కుటుంబపోషణ కోసం అప్పులపాలవుతున్నాడన్నారు. జగన్ మాత్రం తాడేపల్లి, బెంగుళూరు,ఇడుపులపాయ, హైదరాబాద్ లలో ప్యాలెస్ లు కట్టుకొని, విలాసవంతమైన జీవితం గడుపుతూ, పేరుకి మాత్రం రూపాయిజీతమే తీసుకుంటున్నానంటూ ప్రజలను మోసగిస్తున్నా డని ప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

రూపాయిజీతంతో ముఖ్యమంత్రి తన విలాసజీవితాన్ని ఎలా గడుపుతున్నారో చెబితే, ప్రజలు కూడా ఆయనచూపిన మార్గంలోనే నడుస్తారని టీడీపీనేత ఎద్దేవా చేశారు. రూపాయిజీతం తీసుకుంటున్నానని చెబుతున్న ముఖ్య మంత్రి , కోట్ల రూపాయల ప్రజలసొమ్ముని సాక్షిపత్రికకు ఎలా దోచిపెడుతున్నాడో చెప్పాలన్నారు. 

కుంటిసాకులు చెబుతున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా  18లక్షల రేషన్ కార్డులను తొలగించిం దని, పదెకరాలభూమి ఉండకూడదని, రెండెకరాలకు మించి మాగాణి, నాలుగుచక్రాలవాహనాలు ఉండకూడదని, విద్యుత్ వాడకం 300యూనిట్ల దాటిందనే పిచ్చిపిచ్చికారణాలతో రేషన్ కార్డులను తొలగించడం జరిగిందన్నారు.  18లక్షల కార్డులను తొలగించడం ద్వారా జగన్ 18లక్షల పేదకుటుంబాలకు పండుగ ను దూరం చేశాడన్నారు.
 
తిరుమలతిరుపతి దేవస్థానంలో వైసీపీనేతలు, మంత్రులు శాస్త్ర విరుద్ధంగా, సంప్రదాయాలను తుంగలో తొక్కేలా వ్యవహరించి, కోట్లాదిమంది హిందువులమనోభావాలను కించపరిచారని ప్రసాద్ స్పష్టంచేశారు. రాజంపేట వైసీపీఎమ్మెల్యే 2వేలమందితో కొండపైకి  వెళ్లాడని, ఆసమయంలో ఆయన వెంటవచ్చినవారందరినీ టిక్కెట్లు లేకపోయినా స్వామివారి దర్శనానికి అనుమతించారన్నారు.

అంతటితో ఆగకుండా స్వామివారి కొండపై డ్రోన్ కెమెరాలు ఎగరేసి, చేయరానిపాపం చేశారన్నారు. తిరుమలలో సిగరెట్లు తాగడం వంటిచర్యలతో పవిత్రమైన ప్రదేశాన్ని వైసీపీనేతలు, కార్యకర్తలు అపవిత్రం చేశారన్నారు.  ఆనాడు రాజంపేట ఎమ్మెల్యే అలా వ్యవహరిస్తే, నేడు మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు వేంకటేశ్వరుని సన్నిధిలో అన్యమత ప్రస్తావనచేయడం దారుణమన్నారు.

వైకుంఠఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చేభక్తులకు స్వామివారి దర్శనం కల్పించలేని దుస్థితికి టీటీడీ దిగజారిందని సప్తగిరిప్రసాద్ మండిపడ్డారు. హిందూభక్తుల మనోభావాలను, వారి సంప్రదాయాలను మంటగలిపేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని ఆయన హితవుపలికారు. టీటీడీ ఉద్యోగులు వీఐపీల సేవలో తరిస్తూ, సామాన్యభక్తులను చిన్నచూపుచూడటం తగద న్నారు.

పవిత్రమైన తిరుమలకొండపైకి సిగరెట్లు ఎలావచ్చాయో, వైసీపీకార్యకర్తలు అపవిత్రమైనచర్యలకు పాల్పడుతున్నా అధికారులు ఎందుకుపట్టించుకోలేదో పూర్తిస్థాయి విచారణ జరిపిం చి, తప్పుచేసినవారిని కఠినంగా శిక్షించాలని ప్రసాద్ డిమాండ్ చేశారు.  ఏడుకొండల వేంకటేశ్వరస్వామి పవిత్రత మంటగలిసేలా వ్యవహరిస్తే ప్రభుత్వం తగినమూల్యం చెల్లించుకుంటుందన్నారు.

గతంలో కూడా ఎస్వీబీసీఛానల్ సిబ్బంది, పోర్న్ లింక్ పంపి చేయరాని తప్పిదం చేశారన్నారు. పాలకులు ఇప్పటికైనా ప్రజల ధనాన్ని ప్రకటనలరూపంలో సాక్షిపత్రికకు దోచిపెట్టడం మానేసి, ఆసొమ్ముతో పేదలకు ఉపయోగపడే పనులుచేయాలని ప్రసాద్  డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, జనవరి 1వ తేదీలోగా పేదలకు తెల్లరేషన్ కార్డులపై పండుగసరకులను తక్షణమే అందించాలని సప్తగిరిప్రసాద్ హితవుపలికారు.