బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఎం
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (13:10 IST)

తిరుపతి ఉప ఎన్నిక చంద్రబాబు, జగన్‍‌లకు సవాల్?

తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగలిగినా.. 2019 ఎన్నికలలో జగన్‍ పార్టీ అభ్యర్ధికి వచ్చిన మెజార్టీని చంద్రబాబు తగ్గించగలిగితే.. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలలో మళ్లీ ఉత్సాహం పెరిగి బాహాటంగా తెరపైకి వస్తారు. ఒకవేళ జగన్‍ పార్టీ అభ్యర్ధి ఎన్నికలలో ఓడినా.. అప్పట్లో వచ్చిన మెజార్టీ సగానికి తగ్గినా.. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికార ప్రజాప్రతినిధులు, అమాత్యులు నిరుత్సాహానికి గురి కావాల్సి వస్తుంది.

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక గత సంవత్సరన్నర నుండి గ్రామ స్థాయి నుండి మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు అధికారానికి భయపడి ఇళ్లకే కొంతమంది పరిమితం అయ్యారు. మరి కొంత మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కొందరు మౌనంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించుకుంటున్నారు.

జగన్‍ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గ్రామ స్థాయి నుండి మండల, జిల్లా స్థాయి వరకు ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటున్నారు.
 
అప్పుడప్పుడు దాడులు చేస్తున్నారు. అంతే కాకుండా కుల, మత పరంగా అదికారం మాదేనన్న చందంగా ధీమాతో కనిపిస్తుండటంతో.. 2019 ఎన్నికలలో జగన్‍ పార్టీకి మద్దతిచ్చిన ఇతర వర్గాల ఓటర్లు అసంతృప్తిగా ఉండటమే కాకుండా.. అధికార పార్టీపై వ్యతిరేకతను అనేక సందర్భాలలో సోషల్‍ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

2019లో చంద్రబాబు ప్రభుత్వంపై మెజార్టీ ఓటర్లలో వ్యక్తమయిన వ్యతిరేకతతో పాటు ఆయన సామాజికవర్గానికి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని జరిగిన ప్రచారాన్ని నమ్మిన ఓటర్లు.. అంతే కాకుండా ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులపై వ్యక్తం అవుతున్న అసంతృప్తి, వ్యతిరేకతలతో జగన్‍ పార్టీ అభ్యర్ధులకు మద్దతిచ్చారు.

అంతే కాకుండా తటస్థులు కూడా (ఆఖరి నిమిషం వరకు ఏ పార్టీకి ఓటు వేయాలా అని ఆలోచిస్తున్న ఓటర్లు) ఆఖరి నిమిషంలో జగన్‍ పార్టీ అభ్యర్ధులకు ఓటు వేశారు. ఈ దఫా అలాంటి పరిస్థితులు తారు మారు అయ్యాయి. అప్పట్లో చంద్రబాబును వ్యతిరేకించిన ఓటర్లు.. ఆఖరి నిమిషంలో జగన్‍ పార్టీ అభ్యర్ధికి మద్దతిచ్చిన తటస్థ ఓటర్లు.. ఈదఫా అదికార పార్టీకి ఓటు వేస్తారన్న నమ్మకం లేదు.

అప్పట్లో కుల, మత అనుకూలతలు, కుల,మత వ్యతిరేకతలు అధికార అభ్యర్ధికి కలిసి వచ్చాయి ఆ దఫా కుల, మత అనుకూలతలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నా.. కుల, మత వ్యతిరేకతలు అధికార పార్టీ అభ్యర్ధికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలున్నాయి.
 
అసలు విషయానికి వస్తే తిరుపతి నియోజకవర్గం లో 1984నుండి 2019వరకు జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు గెలుపు కన్నా..ఆ పార్టీ వ్యతిరేక గెలుపులే ఎక్కువగా ఉన్నాయి. 1984లో టిడిపి అభ్యర్ధిగా విజయం సాధించిన.. మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్‍ 1989 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‍ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించటమే కాకుండా 1991,1996,1998లలో కూడా చింతా మోహన్‍ ఎంపీగా విజయం సాధిస్తూనే ఉన్నారు.

1999లో టిడిపి పొత్తుతో బిజెపి అభ్యర్ధి విజయం సాధించారు. 2004, 2009లలో కాంగ్రెస్‍ అభ్యర్ధిగా పోటీ చేసిన చింతా మోహనే విజయం సాధించగా.. 2014, 2019లలో జగన్‍ పార్టీ అభ్యర్ధులే విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల విషయం పక్కన పెడితే.. రాష్ట్ర విభజన జరిగాక జరిగిన ఎన్నికలలో జగన్‍ పార్టీ అభ్యర్ధులే విజయం సాధించారు.

దీనిని బట్టి తెలుగుదేశం పార్టీ కేవలం గత 35 ఏళ్లలో ఒకసారి, ఆపార్టీ పొత్తుతో బిజెపి అభ్యర్ధి మరోసారి మాత్రమే విజయం సాధించిన నేపధ్యంలో తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వెల్లడయ్యే అవకాశాలు లేవు. కానీ 2019లో రెండు లక్షల 25వేల మెజార్టీతో జగన్‍ పార్టీ అభ్యర్ధి విజయం సాధించిన నేపధ్యంలో మళ్లీ అంత మెజార్టీ అధికార పార్టీ అభ్యర్ధికి లభిస్తుందా..?

ఒకవేళ టిడిపి అభ్యర్ధి తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధిస్తే.. జగన్‍ పార్టీ ఖేల్‍ ఖతం.. దుకాణ్‍ బంద్‍.. ఖాయం. ఒకవేళ జగన్‍ పార్టీ అభ్యర్ధికి 2019 ఎన్నికలలో వచ్చిన మెజార్టీలో సగం తగ్గినా.. జగన్‍ రెడ్డి ప్రజాభిమానం కోల్పోయారని స్పష్టమయిందని చంద్రబాబు బాహాటంగా చెబుతారు. ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నికల జగన్‍ రెడ్డి అధికారానికి పరీక్ష.. చంద్రబాబుకు మరో విధంగా పరీక్ష కాబోతుంది.