శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (08:35 IST)

పిచ్చోడి చేతిలో రాయిలా జగన్‌ పాలన : అయ్యన్నపాత్రుడు

ఏపీలో ఇసుక కొరతకు నిరసనగా 36 గంటల దీక్షకు సిద్ధమైన కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ రవీంద్ర సహా అందరినీ బలవంతంగా తరలించారు. అటు కృష్ణా జిల్లాలో పలువురు టీడీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. తాము ప్రజాసమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం అడ్డుకోవడం ఏంటని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
 
ఏపీ సర్కార్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ వైఖరితోనే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి చినరాజప్ప. విశాఖలో లారీ ఇసుక ధర లక్ష రూపాయలు పలుకుతుందని అన్నారు. ఇసుక కోసం కొల్లు రవీంద్ర నిరసన చేస్తే అరెస్ట్‌ చేయడం దారుణం అన్న చినరాజప్ప… టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌ ధర్నాలు చేసినప్పుడు ఇలానే చేసామా అని ప్రశ్నించారు.
 
పిచ్చోడి చేతిలో రాయిలా జగన్‌ పాలన ఉందన్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. తప్పులను ప్రశ్నిస్తే కేసు పెట్టి అరెస్ట్‌ చేస్తారా అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో విర్రవీగినోళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారన్నారు. ఒప్పందం మేరకే పోలవరం కాంట్రాక్ట్‌ను తక్కువగా వేశారని విమర్శించారు అయ్యన్నపాత్రుడు.
 
టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. సీఎం జగన్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని..తమ ప్రభుత్వం 2018లోనే శ్రీకారం చుట్టిందని ఆయన విమర్శలు గుప్పించారు.
 
రాష్ట్రాన్ని అతితక్కువకాలంలోనే అంథకారంగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని టీడీపీ సీనియర్ నేత అలపాటి రాజా అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు సీఎంగా విద్యుత్ కొరతను అధిగమించి… మిగులు సాధిస్తే… జగన్ వచ్చిన వచ్చి తన విధానాలతో మళ్లీ కోతల రాష్ట్రంగా మార్చారన్నారు.

ప్రభుత్వం తక్షణం ఇసుక కొరత తీర్చాలని, రోడ్డున పడ్డ లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.