శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

మెగాస్టార్ చిరంజీవి- జగన్ భేటీ వాయిదా

టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్య శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన భేటీ వాయిదా పడింది.

నిజానికి వీరిద్దరి మధ్య భేటీని ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. చిరంజీవితోపాటు ఆయన తనయుడు రాంచరణ్ కూడా ఈ భేటీకి హాజరు కావాల్సి ఉంది. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను వీక్షించాల్సిందిగా కోరేందుకే చిరంజీవి భేటీ కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి ఆయనను తొలిసారి కలవనుండడంతో సర్వత్ర చర్చ మొదలైంది.
 
అనుకున్న ప్రకారం శుక్రవారం ఉదయం జగన్‌తో చిరంజీవి భేటీ కావాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల ఈ భేటీ 14వ తేదీకి వాయిదా పడింది. ‘సైరా’ సినిమాను వీక్షించమని కోరేందుకే జగన్‌తో చిరు భేటీ అవుతున్నారంటూ అనధికారిక వర్గాలు చెబుతున్నా.. వీరి లంచ్ భేటీ వార్తలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు తెరతీశాయి.

కాగా, ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన చిరంజీవి.. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను చూడాల్సిందిగా కోరారు. దీంతో ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు.