శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:44 IST)

డిసెంబర్‌ నుంచి సచివాలయాలకు జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలను సందర్శించనున్నారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు వారానికి ఒకసారి ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించాలని, కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు ప్రతి వారం ఒక లే అవుట్‌ను సందర్శించాలన్నారు.

ఇళ్ళ పట్టాల పంపిణీపై కోర్టుల్లో పెండింగ్‌ కేసులపై దృష్టి పెట్టాలని, కేసుల పరిష్కారంపై కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వ న్యాయవాదులు దృష్టి పెట్టాలన్నారు. ఇదే విషయంపై అడ్వకేట్‌ జనరల్‌తో తాను రెగ్యులర్‌గా మాట్లాడుతున్నట్లు సిఎం వెల్లడించారు.

1,48,398మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. భూ బదిలీ ద్వారా వారికి భూములను సేకరించడంపై దృష్టి పెట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ పధకంలో రిజిస్ట్రేషన్‌ పట్టాలిచ్చే కార్యక్రమం డిసెంబర్‌లో చేపట్టాలన్నారు.

చిత్తూరు, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఆయా జిల్లాల కలెక్టర్లకు సిఎం అభినందనలు తెలిపారు. టిడ్కో ఇళ్ళకు కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలని, జగనను స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో ఎంఐజి ప్లాట్లకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సిఎం కలెక్టర్లను ఆదేశించారు.

ప్లాట్ల కోసం 3.79లక్షల మంది ఆసక్తి చూపారని, ఇప్పటికీ అధికారులు 1001 ఎకరాలను గుర్తించారన్నారు. మరో 812ఎకరాలకు సంబంధించిన వెరిఫికేషన్‌ను వెంటనే పూర్తి చేయాలన్నారు. అవసరమైన చోట భూ సేకరణ లేదా ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలన్నారు.

ఉపాధి హామీ పనులు మెటీరియల్‌ కాంపోనెంట్‌కు సంబంధించి విజయనగరం, విశాఖపట్టణం, అనంతపురం జిల్లాల అధికారులు దృష్టి పెట్టాలన్నారు. గ్రామ/ వార్డు సచివాలయాల్లో తనిఖీలు ముఖ్యమని, అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. థర్డ్‌వేవ్‌కు సనద్ధతగా ఉండాలని, 104 నెంబర్‌ అనేది వన్‌స్టాప్‌ సొల్యూషన్‌గా నడవాలన్నారు.