1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మే 2024 (10:12 IST)

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 : 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుస్తున్నారు : నాగబాబు

pawan kalyan-Nagababu
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన 21 మంది అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు కె.నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో సహా మిగిలిన 20 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్‌సభ అభ్యర్థులు గెలిచి శాసనసబ, పార్లమెంట్‌లలో అడుగుపెడతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యూహం, చంద్రబాబు నాయుడు అనుభవం, బీజేపీ మద్దతు ఎన్నికల్లో ఫలించాయని అన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. 
 
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మంగళవారం సాయంత్రం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో నాగబాబు మాట్లాడారు. పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఎదురైన ఇబ్బందులు, పోలింగ్ ప్రక్రియ ఏవిధంగా కొనసాగిందనే అంశాలను అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. అన్ని సర్వేలు, రిపోర్టులు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెబుతున్నాయని నాగబాబు ప్రస్తావించారు. 
 
జనసేన పార్టీ 21 స్థానాల్లోనూ విజయం సాధించబోతోందనే సమాచారం ఉందన్నారు. ఎవరి నియోజకవర్గంలో వారు ఇబ్బందులను ఎదుర్కున్నారని, అయితే వాటన్నింటిని అధిగమించి ముందుకు సాగారన్నారు. పార్టీ శ్రేణులందరికీ పవన్ కల్యాణ్ వెన్నెముక అని వ్యాఖ్యానించారు. 17 ఏళ్ల రాజకీయ అనుభవం, శారీరకంగా, మానసికంగా ఎన్నోకష్టాలను ఎదుర్కొంటూ 10 సంవత్సరాలుగా పవన్ కల్యాణ్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. 
 
పవన్ కల్యాణ్ శ్రమ వృథా కారాదనే ఉద్దేశంతో పార్టీ శ్రేణులంతా ఐకమత్యంగా పనిచేశారన్నారు. ప్రతిచోటా జనసేన కార్యకర్తలు ముందన్నారని అన్నారు. టీడీపీ, బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో సైతం జనసేన కార్యకర్తలు, వీరమహిళలు గట్టిగా నిలబడ్డారని ఆయన ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో పరిస్థితులు వైసీపీకి ఏమాత్రం అనుకూలంగా లేవని అన్నారు.