సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మే 2024 (07:32 IST)

పెండింగ్ బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేత

arogyasree
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించిన ప్రైవేటు ఆస్పత్రులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఈ బిల్లులు పేరుకునిపోయాయి. ఈ పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు మీనమేషాలు లెక్కిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ కింద అందించే అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
అంతకుముందు.. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులు, ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారం బుధవారం నుంచి తమ అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశా స్పష్టం చేసింది. గత ఆగస్టు నుంచి బకాయిపడిన రూ.1,500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆశా ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్‌ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ లక్ష్మీశా మంగళవారం రాత్రి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. 
 
ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటుందని సీఈఓ చెప్పారు. గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించనందున బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని ఆశా యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ వై.రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
 
ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోనూ బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోమని వాటి యాజమాన్యాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీస్‌ అసోసియేషన్‌ ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది. 'కొవిడ్‌-19 కింద అందించిన చికిత్స బిల్లులు, ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు సుమారు మూడేళ్ల నుంచి ప్రభుత్వం చెల్లించడంలేదు. బకాయిలు చెల్లించే వరకూ ఆరోగ్యశ్రీ సేవలు అందించేది లేదు. మందుల ఖర్చుల వరకు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చే వారికి వైద్యాన్ని అందిస్తాం. వ్యాధి నిర్థారణ పరీక్షల్లో 50శాతం రాయితీ ఇస్తాం. సర్జరీలు ఉచితంగా చేస్తాం. ఇప్పటికే ఇన్‌పేషెంట్లుగా ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తాం' అని తెలిపింది.