మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 21 జనవరి 2020 (14:57 IST)

రేపు ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కారణమేంటంటే?

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ పెద్దలతో సమావేశం కావడానికి ఆయన మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. బుధవారం ఆయన ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పవన్ హాజరుకానున్నారు. 
 
ఇదిలా ఉంటే... అసెంబ్లీ సాక్షిగా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో అమరావతి రైతులు ఆందోళనను తీవ్రతరం చేశారు. పవన్‌ కల్యాణ్‌తో మంగళవారం రాజధాని గ్రామాల రైతులు కలుసుకున్నారు. ప్రజా రాజధాని కోసం నాడు భూములిచ్చామని.. నేడు తమను అన్యాయం చేస్తున్నారని మహిళా రైతులు జనసేనాని ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
 
రాజధాని రైతుల ఆవేదనను విన్న పవన్ అండగా ఉంటానని.. కేంద్రంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మరోపక్క వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తమకున్న మెజార్టీతో బిల్లులను సునాయాసంగా నెగ్గించుకుంటామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ శాసనమండలిలో మాత్రం తమకు ప్రతికూల పరిస్థితి ఉండటంతో తర్జనభర్జన పడుతోంది. శాసనమండలిని పూర్తిగా రద్దు చేసి పంతం నెగ్గించుకోవాలని భావిస్తోంది.