బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (03:17 IST)

రాజధాని సమస్యపై కేంద్రం దృష్టి సారించాలి: పవన్ కళ్యాణ్

రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించే స్థాయిలో రైతులకు మద్దతు పలుకుతానని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేంద్రం స్పందించే పరిస్థితులు కల్పిస్తానన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు తాను వ్యతిరేకం కాదనీ అమరావతి రైతులకు న్యాయం జరగాలన్నారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాజధాని గ్రామాల రైతులతో సమావేశం అయ్యారు.

తుళ్లూరు, మందడం, యర్రబాలెం, బేతపూడి, నిడమర్రు తదితర గ్రామాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు తమ గ్రామాల్లో పరిస్థితులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. తమ గ్రామాల నుంచి తాము బయటకు వచ్చే పరిస్థితి లేదంటూ వాపోయారు.

రైతుల కష్టాలు విన్న అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..."కేంద్రం స్పందించే దిశగా జనసేన పార్టీ ముందుకు అడుగులు వేస్తుంది. అది ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశం మీద నిర్ణయం తీసుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వండి. మీ పోరాటం మాత్రం ఆపకండి. ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు. లక్ష మందికి పైగా జరిగిన అన్యాయం.
 
రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటా
మహిళలను పోలీసులు తిట్టడం బాధ కలిగిస్తోంది. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇవ్వడమే మీరు చేసిన తప్పా.?

ఇది కేవలం రాజధాని రైతుల సమస్య కాదు. ఇది రేపటి రోజున ఎలాగైనా రూపాంతరం చెందవచ్చు. ప్రజలకు ఉద్యమించే హక్కు, నిరసన తెలిపే హక్కు ఉంది. మీరు రాష్ట్రానికి భూములు ఇచ్చారు. అది వాళ్లు గ్రహించేలా, మీకు న్యాయం జరిగేలా అండగా నిలబడతాను.
 
భూములు తీసుకునేప్పుడే అనుమానించా
ఇన్ని వేల ఎకరాల భూములు తీసుకుంటున్నప్పుడు నేను కీడెంచాను. తేడా వస్తే రైతుల పరిస్థితి ఏంటి అన్న అనుమానం వ్యక్తం చేశాను. సిఆర్డిఎ చట్టం ఉంది భయం లేదు అని చెప్పారు. రాజధాని ప్రాంతానికి రాష్ట్రం ఆమోదం తెలిపింది. కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష నేత ఆమోదం తెలిపారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చారు.  ఏ ప్రాంతం వారూ ఇక్కడ రాజధానిని వ్యతిరేకించలేదు. అలా అని ఉంటే రాజధాని ప్రజలు భూములు ఇచ్చే వారే కాదు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభత్వంతో ఎందుకు చేస్తారు?
రైతుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా చిత్రిస్తున్నారు. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అంటే ఎవరికి వారు చేసుకునేవారు. ప్రభుత్వానికి భూములు ఎందుకిస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే వైసీపీ నేతలు అర్ధంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు.

151 మంది ఎమ్మెల్యేల బలమైన మెజారిటీ ఉండి మీకు పోలీస్ పహారాలో తిరగాల్సిన అవసరం ఏంటి? అంత మెజారిటీ వచ్చిన మీకు ప్రజలే రక్షణగా ఉండాలి. మీరు ఓట్లు వేసిన ప్రజల నుంచే మీకు రక్షణ కావాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు తప్పు చేస్తున్నారని బలంగా తెలుస్తోంది. ఫోటోలు చూస్తుంటే అర్ధం అవుతోంది. పోలీసులు టార్పాలిన్ పట్టుకుని కాపలా కాయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ రోజుకీ తరలింపుపై స్పష్టత లేదు
ఈ రోజుకీ రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తున్నాం అన్న విషయానికి సంబంధించి ఒక గెజిట్ గానీ, జీవో గానీ రాలేదు. అడుగులు ముందుకు వేస్తున్నారు తప్ప స్పష్టత ఇవ్వడం లేదు. నాయకుల ఆలోచనా విధానం ప్రజల్ని కలిపేలా ఉండాలి. ప్రజల్ని, ప్రాంతాలను విడదీసే ఆలోచనా విధానానికి జనసేన పార్టీ దూరం.

రైతు కన్నీరు శ్రేయస్కరం కాదు
 భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుందన్న భావన అన్ని ప్రాంతాల ప్రజల్లో ఉంది. వారి మద్దతు ఉంది. మీకు అన్యాయం జరుగుతుందన్న భావన ప్రతి జిల్లాలో కనబడుతోంది. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తే.. ఇప్పుడు మహిళలతో పాటు చిన్నా పెద్దా అంతా రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి వచ్చిందనే సానుభూతి ఉంది.

సానుభూతి లేదు అని మాత్రం అనుకోవద్దు. అయితే దాన్ని ఎలా వ్యక్తపరచాలో వారికి తెలియదు. రాజధాని రైతులు పడుతున్న కష్టాల మీద రాష్ట్రం మొత్తం సానుభూతి ఉంది. ఆ సానుభూతిని అర్ధం చేసుకుని మీకు హామీ ఇస్తున్నా. మీకు న్యాయం జరిగే వరకు రాజధాని అంశంలో ఎలాంటి ముందడుగు పడడానికి వీల్లేదు. రాజధాని రైతులు సంతృప్తి చెందిన తర్వాతే ఎలాంటి ఆలోచన అయినా ముందుకు వెళ్లాలి. రైతులును కన్నీరు పెట్టించి రాజధాని ఎటు తీసుకువెళ్లినా అది శ్రేయస్కరం కాదు.

ఏ నిర్ణయం అయినా మీకు న్యాయం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలి"  అన్నారు. సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.