మీలో ఒకడిలా వచ్చా... పవర్ స్టార్ అనే పదమే ఎక్కలా... పవన్ కళ్యాణ్
రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు పవర్ స్టార్ అనే పదమే ఎక్కలేదని, అలాంటిది సీఎం పదం ఎలా ఎక్కుతుందంటూ ప్రశ్నించారు. సీఎం పదవి బాధ్యతాయుతమైనదన్న పవన్ రాజకీయాల్లోకి రావాలంటే డబ్బులుంటే చాలనే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో తెదేపా-భాజపాల నుంచి ఏమీ ఆశించకుండా ప్రజలకు మేలు చేస్తారని మద్దతు తెలిపాననీ, ఐతే వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. తను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదనీ, మంచి చేద్దామని వచ్చానన్నారు. నాకు డబ్బే అవసరం అయితే సినిమాలు చేసుకుంటూ గడిపేయవచ్చనీ, కానీ ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో పార్టీ పెట్టినట్లు వెల్లడించారు.
నేను సీఎం కొడుకును కాదనీ, అలాగే రాజకీయ పార్టీ నాయకుల కుటంబం నుంచి రాలేదనీ, సాధారణ పోలీసు ఉద్యోగి కొడుకుననీ, మీలో ఒకడిలా మీ ముందుకు వచ్చానన్నారు పవన్ కల్యాణ్. జనసేనకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి ఎలా వుంటుందో, యువత భవిష్యత్తు ఎలా మారుతుందో చేసి చూపిస్తామని అన్నారు.