జర్నలిస్టులకు రూ.50 లక్షల కరోనా బీమా సౌకర్యం కల్పించాలి: ఏపీజేఎఫ్

journlists agitation
ఎం| Last Updated: సోమవారం, 20 జులై 2020 (18:22 IST)
ఏపీ వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని, డాక్టర్లు, వైద్య,పారిశుద్ధ్య, పోలీసు,సచివాలయ వాలేంటర్ లకు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ 50 లక్షల బీమా సౌకర్యాన్ని జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్త నిరసన లో భాగంగా విజయవాడలోని ఏపీజేఎఫ్ కార్యాలయంలో
రాష్ట్ర, నగర శాఖ ల ఆధ్వర్యంలో సోమవారం ఒకరోజు నిరసన దీక్ష జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు మాట్లాడుతూ ప్రస్తుత కరోన విపత్కర పరిస్థితుల్లో వాస్తవాలను ప్రజలకు తెలియ పరచేందుకు అహర్నిశలు కష్టపడుతున్న జర్నలిస్టుల సేవలను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారికి అవసరమయ్యే రక్షణ పరికరాలను అందించాలని కోరారు.

అంతేకాక విధి నిర్వహణలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు 25 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలని, అలాగే జర్నలిస్టుల కుటుంబాలకి నెలకు పదివేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ కరోనా పరీక్షలు చేయాలని, వారికి తక్షణం ఎన్ 95 మాస్క్లు అందజేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు బ్రమ్మయ్య, రాష్ట్ర కార్యదర్శి వీర్ల
శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ ఈ రోజున కరోనా యుద్ధ సమయంలో ప్రత్యక్షంగా పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి వారు అభినందనలు తెలియజేశారు. వీరితో పాటు జర్నలిస్టులు కూడా ఈ సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ఎంతో పోరాటం చేస్తున్నారని, వారి సేవలను గుర్తించి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏపిజేఎఫ్ రాష్ట్ర, నగర నాయకులు దావులూరి దయాకర్, కోట రాజా, జై కిషోర్, ప్రశాంత్, గంగాధర్, సురేష్ బాబు ,సుధాకర్ త దితరులు పాల్గొన్నారు.
దీనిపై మరింత చదవండి :