న్యాయమూర్తులు అందరికీ అర్థమయ్యే భాషలో తీర్పులివ్వాలి: జస్టిస్ ఎన్వీ రమణ
అట్టడుగు స్థాయిలోనూ పటిష్ట న్యాయ వ్యవస్థ ఉండాలని, లేకుంటే ఆరోగ్యకరమైన న్యాయ వ్యవస్థ సాధ్యం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఆధ్వర్యంలో న్యాయ అవగాహన ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మాట్లాడుతూ, అట్టడుగు స్థాయిలోనూ పటిష్ట న్యాయ వ్యవస్థ ఉండాలని అభిలషించారు. అన్నింటి కంటే ముఖ్యంగా న్యాయవ్యవస్థ మానవీయంగా పనిచేయాలని వ్యాఖ్యానించారు. బాధితులు తొలుత వచ్చేది ట్రయల్ కోర్టులకేనని గుర్తించాలని తెలిపారు. మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్ లను ప్రాచుర్యంలోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టులు అత్యంత స్వతంత్రంగా పనిచేయాలని రమణ సూచించారు. న్యాయమూర్తులు అందరికీ అర్థమయ్యేలా సాధారణ భాషలోనే, స్పష్టంగా తీర్పులు రాయాలని పేర్కొన్నారు. న్యాయస్థానాల నిర్ణయాలకు సామాజిక ప్రభావం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. న్యాయసహాయ ఉద్యమ ప్రోత్సాహానికి సహకరించారంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ణ్నతలు తెలిపారు.